23 June, 2026 | 2:44 AM

ఆర్డీఎస్ వేగవంతం

23-06-2026 01:32 AM
  1. తుంగభద్ర జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుతాం 
  2. తుమ్మిళ్ల రెండో దశ పనులను వేగవంతం చేస్తాం 
  3. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం 
  4. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను ఇకపై ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ వ్యవస్థను బలోపేతం చేయడం, తుంగభద్ర జలాలపై తెలంగాణ హక్కులను పరిరక్షించడం, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను వేగంగా అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆర్డీఎస్, తుంగభద్ర ఆనకట్ట నిర్వహణ, అంతర్రాష్ట్ర జలాల పంపిణీ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.  సమావేశంలో రైతు ప్రతినిధులు ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ దుస్థితి, పొరుగు రాష్ట్రాల ద్వారా జరుగుతున్న అనధికార నీటి మళ్లింపులు, తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఆర్డీఎస్ వ్యవస్థలోని అనేక నిర్మాణాలు కాలపరిమితి దాటిపోయాయని, అత్యవసర పునరుద్ధరణ అవసరమని వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బలోపేత పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, కాలువ గట్టులను పటిష్టం చేయాలని, నీటి నష్టాలను తగ్గిస్తూ కాలువల సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ జలాశయాల ద్వారా సుమారు 2.12 టీఎంసీల స్థూల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే రైతులకు న్యాయమైన, తగిన పరిహారం అందేలా చూడాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

మల్లమ్మకుంట జలాశయం వల్ల 567 ఎకరాలు, జూలకల్ వల్ల 382 ఎకరాలు, వల్లూరు జలాశయం వల్ల 2,216 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఆర్డీఎస్ కాలువ వ్యవస్థ ద్వారా తెలంగాణకు హామీ మేరకు నీటి విడుదలలు కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాలువ వ్యవ స్థలో కీలక ప్రాంతాల్లో నీటి ప్రవాహాలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని మంత్రి స్పష్టం చేశారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణకు ప్రాతినిథ్యిం వహిస్తున్న అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఆర్డీఎస్ నిర్వహణ, కేసీ కెనాల్ నీటి విడుదలలు, అంతర్రాష్ట్ర సమన్వయం, ట్రిబ్యునల్ తీర్పుల అమలు వంటి అంశాలపై కూడా చర్చించారు. సాంకేతిక అంశాలు, రైతుల ఆందోళనలు, న్యాయపరమై న అంశాలు, విధానపరమైన ప్రత్యామ్నాయాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

ఈ విషయాలపై త్వరలోనే ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చిస్తామని మంత్రి తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూనే తెలంగాణ నీటి హక్కులను దృఢంగా కాపాడుతామని మంత్రి స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఈ శ్రీధర్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, ఇంజినీర్- ఇన్- చీఫ్ జనరల్ రమేష్‌బాబు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, జలవ నరుల నిపుణులు, ఉన్నతాధికారులు, ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.