23 June, 2026 | 2:44 AM

విలీనం చేయాలి

23-06-2026 01:34 AM
  1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపాలి 
  2. కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయండి 
  3. ఎన్నికల నిర్వహణపై కార్మికుల్లో అసంతృప్తి 
  4. సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్టీసీ జేఏసీ లేఖ 

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్టీసీ జేఏసీ లేఖను రాసింది. ఈ లేఖలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి యాదగిరి పలు అంశాలను ప్రస్తావించారు.

‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది. ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం మంత్రుల సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీలను వేసి ఈ ఏడాది ఏప్రిల్ 24న ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరిపింది.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తూ ఓ కమిటీని వేస్తామని, ఆ కమిటీలో గుర్తింపు సంఘ ప్రతినిధులు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. దీనికి అన్ని కార్మిక సంఘాలు అంగీకరించాయి. తర్వాత ఈ ఏడాది మే 1న స్వయంగా సీఎం అన్ని కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముందు మీకు విలీనం కావాలా? లేక గుర్తింపు సంఘం ఎన్నికలు కావాలా? అని అడిగారు.

దానికి జేఏసీ తరఫున వెంటనే స్పందించి అదే రోజు ఎన్నికల కంటే ముందు విలీనమే కావాలని, ఆ ప్రక్రియను మే డే సందర్భంగా ప్రకటించాలని జేఏసీ పేరుతో వినతిపత్రం ఇచ్చాము. ఆ తర్వాత అన్ని సంఘాలు విడివిడిగా ఎన్నికల కంటే ముందు విలీనమే కావాలని వినతిపత్రాలు ఇచ్చాయి. కానీ, నేటివరకు ఆ విలీనం అంశంపై ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, సీఎం ఆదేశానికి విరుద్ధంగా విలీనం కంటే ముందుగా ఎలక్షన్లు జరపాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నందుకు కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ప్రస్తుతం ఆర్టీసీలో మెజార్టీ కార్మికవర్గమంతా సీఎం సూచనల మేరకు విలీనమే ముందు చే యాలనే అభిప్రాయంతో, ఆశతో ఎదురు చూ స్తున్నారు. రోజు రోజుకు విలీన అంశం కాలయాపన చేయటంతో ప్రతినెల రిటైర్ అవుతున్న వా రికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి విలీన ప్రక్రియ ప్రారంభించాలి’ అని లేఖలో కో రారు. ఈ లేఖను మంత్రుల సబ్‌కమిటీ చైర్మన్, సభ్యులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, డి.శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కూడా పం పించినట్లు జేఏసీ నేతలు ప్రకటనలో తెలిపారు.