క్రీడా పాలసీతో ఆటగాళ్లకు ప్రోత్సాహం
హైదరాబాద్, ఆగస్టు 21(విజయ క్రాంతి): మారుమూల పాఠశాల నుంచి ప్రతి విద్యార్థి, విద్యార్థిని కనీసం ఏదో ఒక క్రీడలో పాల్గొనే విధంగా తెలంగాణ క్రీడా పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారు. అందుకనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసి ప్రోత్సహించడానికి పటిష్టమైన స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై స్టేట్ లెవల్ కమిటీ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్ టూరిజం ప్లాజాలో నిర్వహించారు.
కీడలను ప్రోత్సహించడంలో ఐటీ, ఫార్మా, ఇతర ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యం కోసం ఒక సమావేశం నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారు. క్రీడా ముసాయిదాపై అందిన సూచలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ తెలిపారు. గతంతో పోలిస్తే క్రీడలకు ఈ ఏడాది 10 రెట్లు అధికంగా నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడా సలహాదారుడు జితేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రీడా అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, పుల్లెల గోపీచంద్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, సాయ్ వైస్ చైర్మన్ సోనీ బాలాదేవీ, తదితరులు పాల్గొన్నారు.






