ప్రీలాంచ్‌లపై మౌనమెందుకో!

28-04-2024 12:31:35 AM

హెచ్‌ఎండీఏ పరిధిలో ఇష్టారాజ్యంగా..

రెరా తీరుపై అనుమానాలు

సీఎం రేవంత్ రెడ్డి రెరాను ప్రక్షాళన చేసేనా..?

కొద్ది నెలల కిందట ఓ నిర్మాణ సంస్థ కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రీలాంచ్‌లకు గేట్లు తెరిచింది. తక్కవ ధరలకే ప్లాటు అని ప్రచారం చేయడంతో వేలమంది బయ్యర్లు పోటీపడి మరీ డబ్బులు చెల్లించారు. కానీ బయ్యర్ల నుంచి వందల కోట్ల రూపాయలను వసూలు చేసిన ఆ నిర్మాణ సంస్థ తదనంతరం చేతులెత్తేసింది. వేల సంఖ్యలో బాధితులు పోలీసులను, రెరాను ఆశ్రయించడంతో సదరు నిర్మాణ సంస్థకు జరిమానా విధించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ బాధిత బయ్యర్లకు మాత్రం నేటి వరకు న్యాయం జరగలేదు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని హఫీజ్ పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.80లోని స్థలం కోర్టు వివాదంలో ఉంది. టైటిల్ వివాదం నడుస్తుంది. ఈ విషయం ఈ విషయం ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ప్రధాన బిల్డర్లందరికీ తెలుసు. కానీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రీలాంచ్‌ల పేరుతో ప్లాట్ల విక్రయాలకు పూనుకుంది. కారణం తెలియదు కానీ జీహెచ్‌ఎంసీ అధికారులు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీ (రెరా) ఉన్నతాధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదే అదనుగా బావించిన సదరు నిర్మాణ సంస్థ తక్కవ ధరలకే ప్లాట్లు అంటూ వినియోదారులను ముగ్గులోకి దించుతుంది. వాస్తవానికి ఆ ప్రాంతంలో రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టులలోని చదరపు అడుగు ధర తక్కువలో తక్కువ రూ.10 నుంచి 12వేల వరకు పలుకుతుంది. కానీ రెరా అనుమతి లేకుండానే నిర్మాణాలు చేయడంతో పాటు అక్రమంగా నిర్మాణాలు చేస్తుండటంతో పాటు ఫ్రీలాంచ్ పేరుతో ఆ నిర్మాణ సంస్థ మాత్రం చదరపు అడుగు ధర కేవలం రూ.4700లుగా నిర్ణయించి ఇప్పటికే రూ.200 కోట్ల వరకు పోగేసుకున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. 

తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు పక్కన ఓ నిర్మాణ సంస్థ నార్త్ ఈస్ట్ హ్యబిటేషన్ పేరుతో నిర్మాణాలకు శ్రీకారం చుట్టడంతో పాటు రెరా నిబంధనలకు విరుద్ధంగా కొత్త రకం ప్రీలాంచ్‌లకు నాంది పలికాడు. సదరు సంస్థ చేసే నిర్మాణాల కోసం బయ్యర్ల నుంచి అప్పు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న అప్పు రెండేళ్లలో 6శాతం వడ్డీతో ఇస్తాము, లేదంటే నిర్మాణం చేస్తున్న భవనంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ రెరా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు చడిచప్పుడు చేయడం లేదు. 

పట్టించుకోని యంత్రాంగం..

వాస్తవానికి నగరంలో రియల్ మోసాలకు ఈ మోసాలు మొదలు కాదు.. అంతం కాదు. కానీ కళ్ల ముందే వందల కోట్ల రియల్ మోసాలు జరుగుతున్నప్పటికీ రెరా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు బయ్యర్లను మోసం చేయడం నిత్యాకృత్యంగా మారింది. రెరా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న భవనాలన్ని అక్రమ నిర్మాణాలుగా బావించాల్సి ఉంటుంది. రెరా నిబంధనల ప్రకారం ప్రీలాంచ్‌లు చేయరాదు. కానీ హెచ్‌ఎండీఏ పరిధిలో రెరా నిబంధనలు నీరుగార్చుతూ నిర్మాణ సంస్థలు యదేచ్ఛగా ప్రీలాంచ్‌లు చేస్తున్నా అధికారులు చూసిచూడనట్లు ఉండటం వెనుక మతలబు ఏమిటో అంతు చిక్కడం లేదు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెరా సంస్థను ఏర్పాటు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారిని రెరా చైర్మన్‌గా నియమించారు. ఆరంభ శూరత్వం అన్నట్లుగా మొదట్లో రెరా దూకుడుగానే వ్యవహరించారు. తదనంతరం టీఎస్ రెరాకు చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న రియల్ మోసాలపై కనీస దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించారు. కానీ నగరంలో రెరా నామ్కే వాస్తే అన్న చందంగా మారిందని చెప్పవచ్చు. 

రియల్ భూం కోసం అడ్డదారులు..

నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలం పాటల్లో భూముల్ని దక్కించుకున్న బిల్డర్లు ప్రీలాంచ్‌ల ద్వారా వచ్చిన సొమ్మును హెఎండీఏకు చెల్లించేవారు. ఆదాయం వస్తుండటంతో ప్రభుత్వంతో పాటు రెరా అధికారులు బిల్డర్ల వ్యవహారాలను చూసిచూడనట్లు వ్యవహరించారు. అయితే హెచ్‌ఎండీఏ వేలం పాటలతో రాష్ట్రంలో, ముఖ్యంగా నగర శివారులో రియల్ భూం వచ్చింది. దీంతో బిల్డర్ల అక్రమాలపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడంతో మెజార్టీ బిల్డర్లు ప్రీలాంచ్‌లపైనే ఆధారపడ్డారు. ప్రీలాంచ్ చేయకపోతే అసలు బిల్డరే కాదనే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే నగరంలో ప్రస్తుతం రియల్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, భవిష్యత్తులో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని, రియల్ ఎస్టేట్  వ్యాపారులు ప్రజల విశ్వాసనీయతను కోల్పోతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పేరుకే జరిమానాలు..

నగరంలో ప్రీలాంచ్‌లు, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట కొన్ని నిర్మాణ సంస్థలు కోట్ల రూపాయల్ని దండుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా బిల్డర్ల ప్రీలాంచ్‌ల్లో మోసపోయిన బయ్యర్లు ఫిర్యాదులు వస్తేనే తప్పా... రియల్ మోసాలను నియంత్రించడంలో రెరా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. అప్పడప్పుడు కొన్ని సంస్థలకు నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు కానీ జరిమానాలను విధించడంలోను తత్సారం చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కేశినేని డెవలపర్స్, సాహితీ, మంత్రి డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ వంటి కంపెనీలపై దాదాపు రూ.17.50 కోట్ల జరిమాన విధించినట్లు రెరా గతంలో ప్రకటించింది. కానీ విధించిన జరిమానాలో ఎంత మొత్తాన్ని రాబట్టారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు. అలాగే బెంగళూరుకు చెందిన ఓ నిర్మాణ సంస్థ హైదరాబాద్‌లో ప్రీలాంచ్ దందాను నడుపుతోంది. గత ఐదేళ్లుగా ఈవోఐ పేరిట వందల ఫ్లాట్లను విక్రయించింది. కానీ ఈ సంస్థపై రెరా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి.

 బూడిద సుధాకర్

అగ్గువ వస్తుందనుకుంటే అసలుకే మోసం..

చాలా మంది పేద, మద్య తరగతి ప్రజలు తక్కువ ధరలకు వచ్చే ప్లాట్లను విక్రయించేందుకు ఆసక్తి చూపుతారు. ప్రీలాంచ్ చేసే బిల్డర్లు కూడా ఇలాంటి కస్టమర్లను టార్గెట్ చేస్తారు. రకరకాల ఆఫర్లను చెప్పి ప్లాట్లను కొనుగోలు చేయిస్తారు. ప్రీలాంచ్ బిల్డర్లు చెప్పే మాటలు, చేసే ప్రకటనలో ఎక్కడైనా అప్పుడు చేసైనా ప్లాటు కొనుగోలు చేయాలనేలా ఆశ కల్పిస్తారు. కానీ వాళ్ల వద్ద ఫ్లాట్ కొనాలనుకునే వాళ్లు ఈ భవనాలను నిర్మించింది ఎవ్వరు? అతని కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ? గతంలో ఎప్పుడైనా అపార్టుమెంట్లను నిర్మించిన అనుభవం ఉన్నదా..?అతని వద్ద గతంలో ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్లు సంతోషంగానే ఉన్నారా..? ప్రీలాంచ్‌లో భాగంగా సొమ్ము కట్టిన తర్వాత.. వాళ్ల నిర్మాణాలకు అనుమతులు రాకుంటే ఎలా..? చెల్లించిన సొమ్ము తిరిగి ఇస్తారా లేదా ? వంటి అంశాలపై దృష్టి సారించాలని రియల్ నిపుణులు సూచిస్తున్నారు. 

వీళ్లపై చర్యలుండవా...?

క్రెడాయ్ హైదరాబాద్‌కు చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రీలాంచులు చేస్తున్నాయని తెలిసినా.. ఆయా కంపెనీలపై రెరా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో ఓ బడా నిర్మాణ సంస్థ అక్రమంగా విల్లాలను నిర్మిస్తున్నా వాళ్లకు రెరా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. నిషేధిత ప్రాంతంలో విల్లాల్ని నిర్మిస్తున్నారని,  బాకారం పంచాయతీ కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినప్పటికీ టీఎస్ రెరా స్పందించలేదు. కనీసం సీఎం రేవంతఠ్ రెడ్డి కలుషితమైన నిర్మాణ రంగాన్ని  ప్రక్షాళన చేస్తారా ..? లేదా అనేది చూడాలి.