పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మహబూబాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ సమాజంలోని అందరి భాద్యత కావాలని మహబూబాబాద్ డిఎస్పీ ఎన్.తిరుపతి రావు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ రోటరి క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్పీ మాట్లాడుతూ పుడమితల్లికి పచ్చటి పందిరి వెయ్యాలనే రోటరీ సంకల్పం గొప్పదని అభినందించారు. రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మనిషి ప్రకృతికి దూరంగా జరిగి పోతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు.
క్రమశిక్షణ తప్పిన మానవాళి చర్యలతో భూగోళం వేడెక్కి వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని, చెట్ల నరికివేత, భూగర్భవనరుల విచ్చలవిడి వినియోగం, అపరిమిత ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగం లాంటి అవలక్షణాలు మానవాళి మనుగడకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీడర్ వద్దుల సురేందర్, సెక్రెటరీ జంగాల విజయ్ కుమార్, ట్రెజరర్ శంతన్ రామరాజు, డిస్ట్రిక్ట్ లీడర్లు బిక్కి వెంకటేశ్వర్లు, కొడారి నాగేందర్, జంగాల నర్సింహారావు, జంగాల మంగపతి రావు, అచ్చ శ్రీనివాస్, కట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






