6 June, 2026 | 1:54 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

06-06-2026 12:34 AM
  1. మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం
  2. పర్యావరణ సమతుల్యతోనే జీవకోటికి ప్రాణాధారం
  3. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కొండపాక, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండపాక మండలం మర్పడగా గ్రామ పరిధిలోని అర్బన్ ఆక్సిజన్ పార్కులో చెట్టు విలువ తెలుసా అనే పోస్టర్ ను విడుదల చేసి, మొక్కలు నాటే కార్యక్రమాన్నిశుక్రవారం రా ష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. మొక్కలను నాటి పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి.

మొక్కల సంరక్షణ మన జీవితంలో భాగస్వామ్యం కావాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులు గవర్నర్ చేతి మీదుగా స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని, 500 హోటల్స్ కి గ్లాసులు పంపిణీ చేశామని అన్నారు. ప్లాస్టిక్ నిషేధించడంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ, సూర్యాపేట తో కలిసి అవార్డు శుక్రవారం తీసుకుంటుందని తెలిపారు. ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ ఉండడంతో నివసించే పరిస్థితి లేదు. తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి ఈ పాలసీ తీసుకొచ్చారు. మొక్కలు నాటడానికి అన్ని గ్రామాలలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని, ప్రజలందరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి పరిరక్షించాలన్నారు.

ఒకప్పుడు ఎక్కడ చూసినా పండ్ల మొక్కలు ఉండేవి, ఇప్పుడు లేకపోవడంతో కోతులు గ్రామాలలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయి. రాష్ట్రంలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలి. గీతా కార్మికుల కోసం ప్రభుత్వం తాటి, ఈత చెట్లను నాటిస్తుంది. గత సంవత్సరం అటెండర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఒకే రోజు మొక్కలు నాటారు అని గుర్తు చేశారు.

గ్రామాలలో మొక్కలు నాటడంలో కాంపిటీషన్ క్రియేట్ చేసి, వాటిని పరిరక్షించిన వారి గ్రామ సర్పంచ్ లను అభినందించండి అని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతినడంతో వచ్చే తరం ఆక్సిజన్ సిలిండర్ లను బ్యాగులల్లో పెట్టుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని దాని మూలంగా ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాపిస్తుందని అన్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా పచ్చదనం కూడా పెరగాలని అన్నరు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయిల్ హెల్త్ కార్డు వలన భూసారాన్ని పరిరక్షించి భూమికి మేలు చేయవచ్చు అని, ఈ కార్డులు రైతులందరికీ అందేలా చూడాలని, రైతులు పంట మార్పిడి చేసి మిల్లెట్స్, పప్పు, నూనె దినుసులు పండించాలన్నారు. భూoపల్లి క్రాస్ రోడ్ నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా 20వేల మొక్కలను ఈ నెలలో నాటేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచభూతాలు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయ ని, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పచ్చదనాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాలో 22 లక్షల మొక్కలను నాటి సంరక్షించామని తెలిపారు. ఈ సంవత్సరం 17 లక్షల మొక్కలు జిల్లా వ్యాప్తంగా నాటేందుకు నర్సరీలలో మొక్కలను వృద్ధి చేశామని తెలిపారు.

ఆవు ఆధారిత వ్యవసాయం చేయాలని సూచించారు. సాంస్కృతిక కళాకారులు పర్యావరణం, మొక్కల పెంపకం పై పాడిన పాటలు అందర్నీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో సిపి సాధన రష్మీ పెరుమాళ్, డీఎఫ్‌ఓ సంధ్యారాణి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్,జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు