పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూర్, జూన్ 19 : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.అనంతరం మండలానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక అండగా నిలిచే కల్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమం కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి గ్రామంలో నిరంతర ప్రక్రియగా కొనసాగాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






