కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి
- భద్రాద్రి కొత్తగూడెంలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుతో రైతులకు మేలు
- ఆయిల్‌పామ్ గెలల కనిష్ఠ మద్దతు టన్ను ధర రూ.25వేలుగా నిర్ణయించాలి -
- హార్టికల్చర్ యూనివర్సిటీకి నిధులు మంజూరుచేయాలి -
-కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి రాష్ట్రమంత్రి తుమ్మల వినతి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): భద్రాద్రికొత్తగూడెంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్, సహాయమంత్రి భగీరథ్ చౌదరికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రు లను సోమవారం రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి రాష్ర్ట వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి సంబంధించి అభ్యర్థనలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,300 ఎకరాల కొబ్బరిసాగు జరుగుతోందని, అందులో భద్రాద్రి కొత్తగూడెంలో 1,757ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 696ఎకరాలు కలిపి సుమారు 75 శాతం సాగువు తోందని తెలిపారు.
మిగతా జిల్లాల్లో కూడా కొబ్బరిసాగు విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరిబోర్డు కార్యాలయం ఉండేదని, కాని విభజన అనంతరం అది విజయవాడకు తరలించబడిందని తెలిపా రు. దీంతో రాష్ర్ట కొబ్బరి రైతులు సకాలంలో సేవలు అందుకోలేకపోతున్నారని మంత్రి తుమ్మల చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఆశ్వారావుపేట లేదా దమ్మపేటలో పూర్తిస్థాయిలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణదే మొదటిస్థానం..
ఆయిల్‌పామ్ సాగు కోసం కేంద్రం చేపట్టిన ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ -ఆయిల్‌పామ్’ కింద తెలంగాణ రాష్ర్టం 1.25 లక్షల హెక్టార్లను లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటివరకు 75,000హెక్టార్లలో సాగుచేపట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల తెలిపారు. నాణ్యమైన విత్తనాలను అందించే సరఫరాదారుల సమాచా రం లేనందున, కంపెనీలు కేవలం ఐదారుమంది సరఫరాదారులపైనే ఆధారపడుతు న్నారని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాణ్యమైన విత్తనాల సరఫరాదారులను గుర్తించి ఎంప్యానల్ చేయడం ద్వారా రైతులకు నష్టాలు రాకుండా ఆయిల్‌పామ్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని వివరించారు. ఆయిల్‌పామ్ రైతులకు టన్ను ఆయిల్ పామ్ గెలల కనిష్ఠ మద్దతు ధర రూ.25వేలుగా నిర్ణయించాలని కోరారు. దేశీయ క్రూడ్ ఆయిల్ ధరను రూ.1.5లక్షలు నుంచి రూ.1.6లక్షల మధ్యలో నిలుపవచ్చన్నారు.
క్రూడ్ పామ్‌ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని మంత్రి తుమ్మల కోరారు. ఇప్పటికే దేశీయ ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 27.5శాతం నుంచి 40శాతానికి పెంచాలం టూ రాష్ర్ట ప్రభుత్వం తరపున అభ్యర్థించినప్పటికీ, దీనికి విరుద్ధంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరారు.






