3 June, 2026 | 7:17 PM

ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోరుతూ జన సంద్రమైన మానవహారం

03-06-2026 06:10 PM

పేటలో పాఠశాలను ఏర్పాటు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోండి

జేఏసీ కన్వీనర్ తోటపల్లి శంకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున బస్తీ వాసులతో వేలాది మందితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గబ్బిలాల పేట ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ (జేఏసీ) కన్వీనర్ తోటపల్లి శంకర్ హెచ్చరించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో వందలాదిమందితో మానవహారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఏసీ కన్వీనర్ తోటపల్లి శంకర్ హాజరై మాట్లాడుతూ, గబ్బిలాల పేట చుట్టుపక్క ప్రాంతాలైన రాజీవ్ గాంధీ నగర్, శాంతినగర్, గాంధీ నగర్, జయశంకర్ నగర్, కేసీఆర్ నగర్, పాత గబ్బిలాల పేట తదితర ప్రాంతాలలో వందలాదిమంది చదువుకు నోచుకోని పేద పిల్లలు ఉన్నారని వారికి విద్యాభ్యాసం అందని మామిడిపండు లాగే తయారైందని, అక్కడ ఉన్న ఒకే పాఠశాల కేవలం రెండు గదులతోనే నిర్వహిస్తున్నారని వాపోయారు.

గబ్బిలాల పేటలో జిల్లా కలెక్టర్ స్థలాన్ని ఏర్పాటు చేయగా స్థానికులు కొందరు తమ భూములని కోర్టుకు వెళ్లి అడ్డు తలుగుతుండడం మంచి పద్ధతి కాదన్నారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవే లేదన్నట్టు గా ప్రభుత్వం తలుసుకుంటే వెంటనే ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయవచ్చునని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.

ఇకనైనా వెంటనే స్థలాన్ని కేటాయించి గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి బస్తీలలో వేలాది మందితో సంతకాలు సేకరించామని వచ్చే వారంలో స్థానిక ప్రజా ప్రతినిధులను జిల్లా యంత్రాంగాన్ని కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాలను సాధించేవరకు పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.