హల్దీ ఫంక్షన్‌లో ఫుడ్ పాయిజన్
- 41 మందికి అస్వస్థత
సంగారెడ్డి ఆసుపత్రిలో నలుగురు చిన్నారులకు చికిత్స
మెదక్, మార్చి 28(విజయక్రాంతి): -మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ వేడుకల్లో భోజనం చేసిన తర్వాత 41మంది వాంతులు, విరోచనలతో అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్‌లో కంప్యూటర్ సెంటర్ నిర్వహించే మహమ్మద్ అవేజ్ వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో హల్దీ వేడుకలతో పాటు గృహప్రవేశ కార్యక్రమాన్ని రెండురోజుల ముందు నిర్వహించారు.
ఈ వేడుకలకు తమ సమీప బంధువులను ఇరు గు, పొరుగు వారిని ఆహ్వానించారు. ఈ వేడుకలకు హాజరైన వారంతా మాంసాహారం భోజనం చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే అందరికీ వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన 41 మంది నర్సా పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందిన అనంతరం కొందరి ఆరోగ్యం కుదుటపడడంతో అదే రాత్రి ఇంటికి వెళ్లిపోయారు. ఇందులో 9 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. నలుగురు పిల్లల ఆరోగ్యం క్షీణించ డంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.




