19 August, 2026 | 2:50 AM

రైల్వే బ్రిడ్జిల పనులను పరిశీలించిన ఈటల

19-08-2026 01:46 AM

మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో కేంద్ర ప్రభుత్వం ప్రసిద్ధ ’అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి పనులను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైల్వే ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, తుర్కపల్లి, జనప్రియ, నేరేడ్మేట్ ప్రాంతాలలో  జరుగుతున్న ఆర్.ఓ.బీ , ఆర్.యు.బీ  నిర్మాణ పనుల పురోగతిని నేరుగా అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని, నిర్మాణంలో ఉన్న ఆర్.ఓ.బీ, ఆర్.యు.బీ పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అత్యంత త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అమృత్ భారత్ పథకం కింద నవీకరణ, ఆధునీకరణ పనులు జరుపుకుంటున్న మేడ్చల్ రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించారు. ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలను తీర్చడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించేందుకు శ్రమిస్తున్నట్లు ఎంపీ గారు తెలిపారు. ఎంపీ వెంట డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, గౌడవెల్లి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులున్నారు.