19 August, 2026 | 2:46 AM

మియాపూర్ సర్కిల్‌ల్లో అక్రమాలకు షాడో కార్పొరేటర్ అభయం!

19-08-2026 01:45 AM
  1. కార్పొరేటర్ పీఏ పేరిట అక్రమ దందా
  2. బాహాటంగానే బెదిరింపులు చోద్యం చూస్తున్న యంత్రాంగం 
  3. అతని పేరు వింటేనే అధికారుల గుండెల్లో గుబులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి): సీఎంసీ పరిధిలోని మియాపూర్ డివిజన్లో అక్రమ నిర్మాణాల దందా హద్దుఅదుపు లేకుండా సాగుతోంది. సీఎంసీ నిబంధనలను బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తూ, అనుమతులకు తిలోదకాలు ఇస్తూ అక్రమార్కులు విచ్చలవిడిగా బహుళ అంతస్తుల భవనాలను లేపుతున్నారు. ఈ దందాతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా,యంత్రాంగం మాత్రం కంటిముందే అక్రమాలు జరుగుతున్నా కళ్ళు మూసుకుని కూర్చోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల నీడలో రూపుదిద్దుకున్న ఓ సూత్రధారే ఈ అక్రమ సామ్రాజ్యానికి చక్రవర్తిగా మారారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కార్పొరేటర్ పీఏ అవతారం వసూళ్ల పర్వం..

మియాపూర్ కార్పొరేటర్కు అత్యంత సన్నిహితుడినని, స్వయంగా పీఏనంటూ చలామణి అవుతున్న  వ్యక్తి ఈ అక్రమ నిర్మాణాల దందాకు ప్రధాన సూత్రధారిగా మారారు. నిర్మాణదారులను నేరుగా కలిసి అధికారుల సంగతి మేము చూసుకుంటాం, మీకు పైసా ఖర్చు తప్ప ఏ ఇబ్బంది రాదు అంటూ బాహాటంగానే అభయమిస్తున్నారు. ప్రజాప్రతినిధి పేరును అడ్డుపెట్టుకుని దర్జాగా లక్షలాది రూపాయల ’సెటిల్మెంట్లు’ చేస్తూ డివిజన్లో సొంత సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ప్రజాసేవ చేయాల్సిన స్థానాన్ని అక్రమ సంపాదనకు వాడుకుంటున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారు.

ఏడు కాలనీలు ఏడాపెడా ఉల్లంఘనలు...

డివిజన్ పరిధిలోని డీకే ఎంక్లేవ్, బీకే ఎం క్లేవ్, రెడ్డి కాలనీ, మియాపూర్ న్యూ కాలనీ, లక్ష్మీనగర్, జేపీ నగర్, మయూరి నగర్ వంటి ఏడు ప్రధాన కాలనీల్లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మంజూరు చేసిన ప్లాన్లకు విరుద్ధంగా అదనపు అంతస్తులు వేయడం, సెట్బ్యాక్ నిబం ధనలను పూర్తిగా పక్కనబెట్టడం, చివరికి పార్కింగ్ స్థలాలను సైతం వ్యాపార అవసరాలకు విక్రయించడం ఇక్కడ నిత్యకృత్య మైంది. బాధితులు,స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయే తప్ప అక్రమార్కులపై చర్యలు మాత్రం శూన్యం.

ఖాకీలైనా అధికారులైనా బెదిరింపులే...

క్షేత్రస్థాయిలో తనిఖీలకు వచ్చే టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సైతం ఈ ’పీఏ’ మహానుభావుడి నుంచి బెదిరింపులు తప్పడం లేదు.పై అధికారులతో మాట్లాడతాం.. పనులు ఆపితే మీ ఉద్యోగాలు ఊడతీయిస్తాం అంటూ రాజకీయ అధికార దర్పంతో హెచ్చరిస్తుండటంతో అధికారులు సైతం భయంతో వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అక్రమ నిర్మాణదారుల నుంచి భారీ మొత్తంలో నజరా నాలు స్వీకరించి,అధికారుల నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించడమే పనిగా ఈ దందా రాజ్యమేలుతోంది.

అసలు ఆ అండ ఎవరిది...?

ఇంత ఘోరంగా అక్రమాలు జరుగుతున్నా, పీఏ పేరిట దందాలు సాగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు మౌనం వహించడం వెనుక అంతర్యమేమిటన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆయన నిజంగానే కార్పొరేటర్ పీఏనా? లేక ప్రజాప్రతినిధి పేరును వాడుకుని సొంతంగా అక్రమ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు నిజాయితీ పరులైతే తక్షణమే ఈ వ్యవహారంపై నోరు విప్పి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఉన్నతాధికారులు కంటితుడుపు చర్యలు విడనాడాలి...

అక్రమాల నిలయంగా మారిన ఈ ఏడు కాలనీల్లో ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక బృందాలతో సమగ్ర తనిఖీలు నిర్వహించాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడమే కాకుండా, కార్పొరేటర్ పీఏగా చలామణి అవుతూ అధికారులను బెదిరిస్తున్న వక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మియాపూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.