రేవంత్‌ను దేవుడు కూడా కాపాడలేడు
l ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
l సీఎం స్థాయిని మరిచి వ్యక్తిగత దూషణ తగదు
l మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డిని దేవుడు కూడా కాపాడలేడని, ఆయనకు తప్పకుండా శిక్ష పడుతుందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు హెచ్చరించారు. 2015 నుంచి ఈ కేసులో రేవంత్‌రెడ్డిని ఎవరు కాపాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో ఏర్పాటు చేసిన క్రాస్ టాక్ విత్ రఘునందన్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక ప్రజలు తిరస్కరిస్తే... మెదక్‌లో ఓట్లు అడుగుతున్నానని రేవంత్‌రెడ్డి తనను ఉద్దేశించి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. కొడంగల్ ఓడిన రేవంత్ మల్కాజిగిరిలో పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. ఒక ఎన్నికతో ఇంకో ఎన్నికను పోల్చడం సరికాదన్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం స్థాయిని మరిచి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడతానంటే కుదరదని, ఆయన భాషలోనే సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. మోడీ.. కేడీ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడితే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు వస్తుందన్నారు. తనకు గడీలు ఉన్నాయన్న ఆరోపణలపై స్పందిస్తూ.. తమ సొంతూరులోని ఇంటిని ఎవరు పేరు చెబితే వారికి రాసిస్తానని తెలిపారు. కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి ఇంటిని చూస్తే గడీ ఎవరిదో తేలిపోతుందన్నారు. ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తామని అంటున్న రేవంత్.. తొలి విస్తరణలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంత్రివర్గంలోనూ ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చారని అడిగారు. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి తేడా ఏమీ లేదన్నారు. మెదక్‌కు, వెంకట్రామిరెడ్డికి ఏం సంబంధం అని, పోరాటాల గడ్డ మీద కేసీఆర్‌కు ఒక్క ఎంపీ అభ్యర్థి దొరకలేదా అని రఘునందన్ ప్రశ్నించారు.






