ప్యాకేజీ ఇవ్వన్నా.. ప్రచారం చేస్తాం!
అభ్యర్థులకు స్థానిక నేతల డిమాండ్
రూ.6 లక్షల వరకు చెల్లించాలని ప్రతిపాదనలు
ఖర్చు సొంతంగా భరించాలంటున్న పార్టీ అధిష్ఠానాలు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి విందును కూడా ప్రచారంలో భాగం చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వేళ కుల సంఘాలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నెలరోజుల నుంచి ప్రచారంలో భాగంగా ఇప్పటికే భారీ ఖర్చు చేశారు. బీజేపీ ముందుగా అభ్యర్థులు ప్రకటించగా, తరువాత బీఆర్‌ఎస్ జాబితా విడుదల చేసింది. నోటిఫికేషన్ జారీ తరువాత అధికార కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు దశల వారీగా ఖరారు చేసింది. ముందుగా ప్రకటించిన అభ్యర్థులు వెంటనే ప్రచారాన్ని పట్టాలెక్కించారు. అప్పటినుంచి రోజువారీగా రూ.10 లక్షల వరకు ఖర్చు వచ్చిందని చెబుతున్నారు.
ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏకకాలంలో ప్రచారం చేస్తు న్నారు. మంది మార్బలంతో బస్తీలు, గ్రామాలు తిరుగుతున్నారు. దినసరి కూలీలను వెంట తిప్పుకుంటున్నారు. వారికి రోజూ నగదు, మధ్యాహ్నం భోజనం, వాటర్ బాటిళ్లు, సాయంత్రం బిర్యానీ, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిరోజు ఖర్చు రూ.20 లక్షలు దాటుతున్నదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీనికితోడు గ్రామ, మండల, డివిజన్ స్థాయి నాయకులు కూడా గత నెలరోజుల నుంచి సొంత పనులు వదిలేసి ప్రచారానికి తిరిగామని దీంతో తమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
కనుక తమకు ప్యాకేజీ రూపంలో డబ్బులు ఇవ్వాలని అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత తమ కుటుంబాలు గడవడం కష్టమని గ్రామస్థాయి నాయకులు రూ. 2లక్షలు, మండల స్థాయి రూ. 5లక్షలు, డివిజన్ లీడర్లు రూ.6 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఒక పార్లమెంటు పరిధిలో సుమారుగా రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రసార సాధనాలకు రూ.5 కోట్లు వరకు ఒప్పందాలు చేసుకుని నామినేషన్ల ప్రక్రియ నాటికే వారికి ముట్టజెప్పామని, స్థానిక నేతలు అడిగే ప్యాకేజీ ఏ విధంగా సమకూర్చాలో అర్థం కావడంలేదని మథనపడుతున్నారు.
మూడు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి
అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో సొంతంగా ఖర్చు పెట్టాలని సూచనలు చేయడంతో వారంతా రాజధానిలో మకాం వేసి రెండు రోజులకొకసారి వచ్చి కొంత నగదు మండల బాధ్యులకు అప్పగించి జారుకుంటున్నారు. దీంతో అభ్యర్థులు అందరికీ సర్దుబాటు చేయలేక అవస్థలు పడుతున్నట్లు సమీప అనుచరులు వెల్లడించారు. కమలం పార్టీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అభ్యర్థులను ముందుగా ప్రకటించడంతో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి పెద్దమొత్తంలో ఖర్చు చేశారు. భానుడి ప్రతాపం తో రోజువారీ ఖర్చులు రెండింతలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గ్రామ, మండల, డివిజన్ స్థాయి నేతలు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీలు డిమాండ్ చేయడంతో తలపట్టుకుంటున్నారు. ముం దుగా అభ్యర్థిని ప్రకటించడంతో ఆర్థిక కష్టా లు పెరిగినట్లు చెబుతున్నారు. పార్టీ ఫండ్ ఇప్పటివరకు రూ.2 కోట్లకు మించి రాలేదని, వారు ఇచ్చిన డబ్బు కూడా అసెంబ్లీ బాధ్యులకు ఇవ్వడంతో వారు అసలైన సమయానికి దొరకకుండా తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి వలస వచ్చి టికెట్లు పొందిన అభ్యర్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. అదే విధంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అభ్యర్థులంతా ఆర్థికంగా బలవంతులు కావడంతో స్థ్దానిక నేతలకు మొదటి నుంచి ప్రత్యేక వాహనాల ఏర్పాటు, రోజువారీగా రూ.10వేలు ఖర్చులు ఇచ్చేవారు. వీటితో సరిపెట్టుకుంటారని భావిస్తే రెండు రోజుల నుంచి తమకు కూడా కొంత నగదు ఇస్తే ఆర్థిక సమస్యలు లేకుండా 24 గంటల పాటు ప్రచారం చేస్తామని కోరుతున్నారు. అభ్యర్థులు మాత్రం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు అర్థిక వనరులు అందజేస్తామని హామీలిస్తున్నారు. కానీ లోకల్ లీడర్లు అప్పటి సంగతి అప్పుడే చూద్దామని ప్రస్తుతం తనతో పాటు వెంట ఉండే అనుచరులకు కలిపి రూ.6 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతమొత్తంలో నగదు సమకూర్చాలంటే ఆస్తులను తాకట్టు పెట్టకతప్పదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దలు మాత్రం ఎవరి ఖర్చులు వారే భరించాలని చెబుతున్నారు.
టికెట్ రాని నేతలకూ..
మొదటి నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలను దారిలోకి తెచ్చేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడ్డారు. ప్రచారానికి రావడానికి వారంతా ససేమిరా అనడంతో చివరకు పార్టీ పెద్దల జోక్యంతో ఆర్థికపరమైన సాయం అందిస్తే పార్టీ జెండా పడుతా మని పేర్కొనడంతో వారికి రూ.50లక్షల విలువ చేసే స్థలాలు, ఖరీదైన వాహనం ఇప్పించారు. వారి వెంట ఉండే అనుచరులకు కూడా రూ.10లక్షల వరకు ముట్ట జెప్పినట్లు తెలిపారు. ఒక పార్లమెంటు పరిధిలో ముగ్గురి నుంచి నలుగురు ఆశావ హులను మచ్చిక చేసుకోవడంతో పాటు వారి అనుచరులతో కలిపితే సుమారు 60 నుంచి 70 మందికి నగదు ఇచ్చినట్లు చెప్పారు. ప్రచారం చివరి వారం రోజులు ఉండటంతో మండల, గ్రామ, డివిజన్ నేతల డిమాండ్‌తో భవిష్యత్తులో రాజకీయం చేయడమంటే అన్ని రకాలుగా ఆలోచించి పోటీ చేయాలని సూచిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల కంటే పార్టీ నాయకులకే ఖర్చు ఎక్కువ వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




