18 July, 2026 | 6:56 AM

అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

01-12-2024 12:00 AM

బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలం టే చాలా కష్టనష్టాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. అలా కష్టాలు పడితేనే విజయం సాధ్యం అవుతుంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం అవకాశాల కోసం తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డారట. అవకాశాలు రాక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. “మా నాన్న స్కూల్ టీచర్ కావడంతో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు.

ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయంచుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ ఇష్టానికి వెళుతున్నావు కాబట్టి సక్సెస్ లేదా ఫెయిల్యూర్ నీ సొంతమే’ అన్నారు. ఫెయిల్ అయితే ఇంటివైపు చూడొద్దన్నారు. మద్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించా. కానీ అవకాశాలు రాక తిరిగి ఇంటికెళ్లా. ఎందుకొచ్చావంటూ నాన్న కోపడ్డారు. తిరిగి మద్రాస్ వచ్చేశా. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.

చివరిసారిగా ఆత్మీయులందరినీ చూడాలనిపించి వారి ఇళ్లకు వెళ్లా. ఈ క్రమంలోనే నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీస్‌కు వెళ్లా. ‘మేలుకొలుపు’ సినిమాకు సంబంధించి అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన నాతో ఏమీ మాట్లాడకుండా నన్ను డబ్బింగ్ థియేటర్‌కు తీసుకెళ్లి ఒక సీన్‌కు నాతో డబ్బింగ్ చెప్పించారు. రెండో సీన్‌కు డబ్బింగ్ చెప్పమనగానే భోజనం పెడితే చెబుతానన్నా. ఆయన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించారు. అక్కడి నుంచి నా సినీ ప్రయాణం ప్రారంభమైంది” అని తెలిపారు.