ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5.364 మీటర్లు) విజయవంతం
సత్తుపల్లి ఏప్రిల్ 28.( విజయ క్రాంతి ): భారతదేశ యువకుడిగా దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పంతో ప్రారంభించిన తన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5,364 మీటర్లు) ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర వాసి బి. మోతి కుమార్ తెలిపారు. వివరాలు తనల మాటల్లో.. ఇండియా నుంచి నేపాల్లోని ఖాట్మండు విమానాశ్రయం ద్వారా లుక్ల వరకు చేరుకుని, అక్కడి నుంచి తీవ్ర చలి, ఆక్సిజన్ కొరత, ప్రమాదకరమైన పర్వత మార్గాల్లో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ మొత్తం 53 కిలోమీటర్ల ట్రెక్కింగ్ను 26 గంటల 9 నిమిషాల 47 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది.
ఈ ప్రయాణంలో నా ప్రధాన లక్ష్యం భారత జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద గర్వంగా ఎగురవేసి దేశ గౌరవాన్ని నిలబెట్టడం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ విజయం నా వ్యక్తిగత సాధన మాత్రమే కాదు, దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. త్వరలోనే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తులో ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మార్గదర్శకులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.






