1 September, 2026 | 12:38 AM

ప్రతి ఫిర్యాదును వారం రోజుల్లో పరిష్కరించాలి

01-09-2026 12:00 AM
  1. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు.. అక్రమణదారులపై ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు
  2. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, ఆగస్టు 31 : ప్రజల ఫిర్యాదులు, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రతి ఫిర్యాదును వారం రోజుల గడువులో పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రజలు తమ అర్జీలు, దరఖాస్తులను మంత్రి కార్యాలయానికి సంబంధించిన 81858 85127 వాట్సాప్ నంబర్కు కూడా పంపవచ్చని తెలిపారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు మినహా ప్రతి ఫిర్యాదును వారం రోజుల్లో పరిష్కరించి, తీసుకున్న చర్యలను అర్జీదారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.

నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, ప్రభుత్వ భూముల అక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అక్రమణదారులపై ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో మానవ దినాల లక్ష్యాలను పెంచాలని, ఉత్తమ పనితీరు కనబరిచే పంచాయతీ కార్యదర్శులను ప్రోత్సహిస్తామని తెలిపారు.

సింగోటం గోపాల్ దిన్నె నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.వీపనగండ్ల మండలానికి కేటాయించిన 375 ఇందిరమ్మ ఇళ్లలో ఇంకా 54 మంది లబ్ధిదారుల ఎంపిక పెండింగ్లో ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

రెండు మూడు రోజుల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటు తుది జాబితాలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. 

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి ఆగ్రహం 

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీపనగండ్లకు చెందిన బీచుపల్లి గౌడ్ తన భూమి సర్వే సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారంలో జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు.

అలాగే కల్వరాల గ్రామంలోని సర్వే నంబర్ 1లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు రావడంతో, మొత్తం భూమిని సమగ్రంగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన స్థలాన్ని క్రీడా మైదానానికి కేటాయించి,

మిగిలిన స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈవో యాదయ్య, స్థానిక సర్పంచ్ పార్వతమ్మ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.