అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్
మంథని, జూన్ 29 (విజయక్రాంతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా, మంథని మున్సిపాలిటీ 11వ వార్డులో చేపట్టిన ఇంటింటి సర్వేను మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి కౌన్సిల ర్‌లతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత బూత్ లెవల్ అధికారులపై బిఎల్‌ఓ ల్ పై ఉందని స్పష్టం చేశారు.
11వ వార్డులో జరుగుతున్న ఈ ప్రక్రియలో చైర్మన్ స్వయంగా పాల్గొని, అధికారుల పనితీరును పర్యవేక్షించారు. ఓటర్ల వివరాల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా, అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, అలాగే అడ్రస్ మారిన వారి వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, యేల్లంకి వంశీధర్, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






