29 April, 2026 | 2:02 AM

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి

29-04-2026 12:41 AM
  1. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
  2. ప్రకృతి వైపరీత్యాల వేళ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది
  3. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
  4. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 

భద్రాద్రి కొత్తగూడెం/సుజాతనగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వ్యవసాయాధారిత ప్రాంతమైన మన జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిందని తెలిపారు.

గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదని ఆయన హెచ్చరించారు. తూకంలో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రజెండా పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని, ప్రభుత్వం నుండి రైతులకు రావాల్సిన ప్రతి పైసాను ఇప్పించే బాధ్యత తమపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.