బల్లగుద్ది చెబుతున్నా.. వెంటాడే ఇరుముడి ఇది
రవితేజ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇదే వేదికపై లాంచ్ చేసిన ‘మల్లెపూల పల్లకి’ పాట అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. నిజంగా కొన్ని క్యారెక్టర్స్ ప్రేక్షకుల మైండ్‌లో ఉండిపోతాయి. బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది” అన్నారు.
‘ఈ సినిమాలో నేను చేసిన కావేరి లాంటి గొప్ప పాత్రను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాన’ని హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ చెప్పింది. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. “ఇండియన్ సినిమాలో చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. ఇది నా గత సినిమాల్లాగా లైట్ హార్టెడ్‌గా ఉంటుందనుకోవద్దు. చాలా సీరియస్‌గా, టెన్షన్‌గా, ఇంటెన్సిటీగా ఉంటుంది. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇది” అని తెలిపారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “ఇరుముడి’ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక భక్తుడి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే థ్రిల్లర్. సినిమా అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్” అని చెప్పారు. ‘ఇది తెలుగులో నాకు ఫస్ట్ సినిమా. ముఖ్యమైన పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాన’ని బేబీ నక్షత్ర కోరింది. ఈ వేడుకలో టాలీవుడ్ డైరెక్టర్లు బాబీ కొల్లి, రాహుల్ సాంకృత్యన్, సాయి రాజేశ్, బుచ్చిబాబు సనా, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌తోపాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






