విశ్వనాథ్ అండ్ సన్స్ తో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. “వెంకీ అట్లూరి సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు చేస్తూ, గొప్ప దర్శకుడిగా ఎదుగుతుంటే..
మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి 40 ఏళ్ల నుంచి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. సినీ కార్మికుల పిల్లల కోసం మంచి పాఠశాల కట్టించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని మా కుటుంబంతో కలిసి చూస్తాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ.. “సూర్య సన్నాఫ్ కృష్ణన్’ ఎంతో ప్రేమ ఇచ్చారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా అంతే ప్రేమ ఇస్తారని కోరుకుంటున్నా” అన్నారు.
‘సూర్యతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాన’ని మమితా బైజు తెలిపింది. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “ప్రేక్షకుల దగ్గర నుంచి.. సినిమాలో ఉన్న తప్పొప్పులు చెప్పే రివ్యూయర్ల వరకు నాకు అందరూ ముఖ్యమే. ఏదైనా తప్పు చేస్తే, దానిని సరి చేసుకొని మరింత బాధ్యతగా పనిచేస్తా. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి అమ్మ కావాలి, ఇలాంటి ఫ్రెండ్ కావాలి అనిపిస్తుంది. సూర్య, మమిత జోడిని తెరమీద చూస్తే ప్రేమలో పడిపోతారు” అని చెప్పారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “చాలారోజుల తర్వాత స్టేజ్ మీద చాలా ధైర్యంగా, నమ్మకంగా చెబుతున్నా.. ఈ సినిమా చాలా బాగుంటుంది. తల్లీకొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత అమ్మని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు” అన్నారు. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్, ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, వై రవిశంకర్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటుడు హైపర్ ఆది కూడా ఈ వేడుకలో మాట్లాడారు.






