calender_icon.png 21 January, 2026 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి

21-01-2026 12:00:00 AM

ఎస్పీ రోహిత్ రాజు

పాల్వంచ , జనవరి 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే ఎరావ్-ఎలైవ్ -2026 అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.  రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు పాల్వంచలోని కే ఎల్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్దినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా కొన్ని వీడియోలు, ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు భద్రతా నియమాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. రోడ్డుపై విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు, ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ తమ తల్లీదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా నడుచుకుంటూ మంచిగా చదువుకుని క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని అకాక్షించారు.

అనంతరం సైబర్ నేరాలపై ఎస్పీ అవగాహన కల్పించారు.అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని తెలిపారు. చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు మారిన పడుతున్నారని తెలిపారు. ఓటీపి, హనీ ట్రాప్, ఆన్లైన్ ట్రేడింగ్, సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు.

గంజాయి సేవిస్తూ పట్టుబడితే జైలుకే

ప్రభుత్వ నిషేధిత గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తున్నట్లుగానీ,సేవిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. చాలామంది యువత గంజాయి మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులు పట్టు బడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, జిల్లా రవాణాధికారి భూషితా రెడ్డి, మోటారు వాహనాల అధికారి వెంకట రమణ, కళాశాల చైర్మన్ నాగమణి, డైరెక్టర్ సిద్దార్థ్ రెడ్డి, పాల్వంచ సీఐ సతీష్, ఎస్త్స్ర సుమన్ సిబ్బంది పాల్గొన్నారు.