21-01-2026 12:00:00 AM
-నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
అలంపూర్ జనవరి 20: గ్రామాలను దత్తత తీసుకుని ఎస్బీఐ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్బి ఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి స్వగ్రామమైన పెద్ద పోతులపాడు గ్రామంలో ఎస్బిఐ ఫౌండేషన్, భవిష్య భారత్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో చేపట్టిన గ్రామ సేవ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎంపీ మల్లు రవితో పాటు ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్బీఐ తెలంగాణ రాష్ట్ర సిజిఎం రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ... ఎస్బిఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి స్వగ్రామం పెద్దపోతులపాడు తో పాటు చుట్టుపక్కల మరో నాలుగు గ్రామాల్లోనూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఎస్బిఐ దేశంలో అన్ని బ్యాంకుల్లో కెల్లా నెం బర్ వన్ గా వెలుగు పొందుతోందని అలాంటి బ్యాంకుకు ఈ గ్రామ వాసి చైర్మన్ గా ఉండడం గర్వకారణం అన్నారు వనపర్తి లో ఎస్బిఐ రీజనల్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థలం కావాలని చైర్మన్ అడిగితే ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరలోనే రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ... ఎస్బీఐ బ్యాంక్ అధికారులు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ బి. ఎం.సంతోష్ మాట్లాడుతూ... పెద్దపోతులపాడు, చిన్న పోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు గోకులపాడు, గ్రామాల్లో ఎస్బిఐ ఫౌండేషన్ రూ. 4 కోట్లు వెచ్చించి విద్య, వైద్య, ఇతర రంగాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు.
అక్షరాస్యతలో వెనుకబడ్డ గద్వాల జిల్లా నుంచి ఎస్బిఐ చైర్మన్ గా ఎదిగిన శ్రీనివాసులు శెట్టిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడి యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఎస్బిఐ తెలంగాణ రాష్ట్ర సిజిఎం రాధాకృష్ణన్ మాట్లాడుతూ... చైర్మన్ స్వగ్రామంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని ప్రాంతాల్లో ఎస్బిఐ ఫౌండేషన్ తన సేవలను విస్తరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, భవిష్య భారత్ స్వచ్ఛంద సేవా సంస్థ మేనేజింగ్ ట్రస్ట్ హరిప్రసాద్, ఎస్బిఐ ఫౌండేషన్ సీఈవో స్వపన్ ధర్,ఎస్బిఐ రీజినల్ మేనేజర్ సునీత తనం , ఆయా గ్రామాల సర్పంచులు, రజాక్, సోమేశ్వరి రత్నకుమార్, భీమ నాయుడు, వై.పి రవి రెడ్డి , రాజశేఖర్ శర్మ,సోమశేఖర్ రెడ్డి,రాజశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.