ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ
షాద్‌నగర్, జూన్ 19 (విజయక్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినప్పుడే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ అన్నారు. శుక్రవారం కొత్తూరు వై జంక్షన్ వద్ద పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు పోలీసులు అక్కడికక్కడే కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనితో స్పందించిన పలువురు వాహనదారులు తక్షణమే హెల్మెట్లు కొనుగోలు చేసి ధరించారు. సుమారు 150 మందికి పైగా ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని కొత్తూరు సీఐ నర్సయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎస్హెచ్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.






