ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
చేవెళ్ల ఆర్‌డీఓ పార్థసింహారెడ్డి
శంకర్‌పల్లి ఆగస్టు 18 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించి ముందుకు రావాలని చేవెళ్ల ఆర్డిఓ పార్థసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రావులపల్లి కాలన్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పల్ రెడ్డి ఫౌండేషన్, పాలిటెక్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో రూ. 1.5 లక్షల విలువచేసే స్కూల్ బ్యాగులు, జామెంట్రీ బాక్సులు, నోటు బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను తదితర స్టేషనరీ సామాగ్రిని ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వంతోపాటు పలు ఎన్జీవో సంస్థలు, సి ఎస్ ఆర్ పథకం కింద పాఠశాలలకు పలు రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. దాతల సహకారంతో విద్యార్థులకు మరింత ప్రోత్సాహకం లభిస్తుందని అన్నారు.
విద్యార్థులు కూడా బాగా చదువుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా శక్తి వంచన లేకుండా విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి తాసిల్దార్ సురేందర్, మండల విద్యాధికారి రవీందర్రావు, గ్రామ సర్పంచ్ సువర్ణ కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జయసింహారెడ్డి, ఉపాధ్యాయులు సుజాత, చంద్రశేఖర్ రెడ్డి, ప్రశాంతి, మోహన్ రెడ్డి, ఆనంద్, రేష్మ బేగం, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు.






