ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
రెడ్క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, జూన్ 16 (విజయక్రాంతి): రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగా కామారెడ్డి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జిల్లాలో విశేష స్పందన లభించిందని అన్నారు, ప్రతి శాఖ అధికారి, ఉద్యోగి అంకితభావంతో పనిచేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందన్నారు. జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు గర్వకారణమని పేర్కొన్నారు.
ఇంకా మన జిల్లా అగ్రస్థానాన్ని కొనసాగించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ నమోదు గడువును జూలై 31 వరకు పొడిగించినందున, పెండింగ్లో ఉన్న నమోదులను పూర్తిచేసి జిల్లాను మరింత ముందంజలో నిలపాలని సూచించారు. ఇప్పటివరకు అందించిన సహకారానికి అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహం, నిబద్ధతతో కార్యక్రమాన్ని కొనసాగించి కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో ,నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని 25 వ రూమ్ నెంబర్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేయడమే నని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.
రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అవసరమైన సమయంలో రక్త నిల్వలు అందుబాటులో ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, ఇది సురక్షితమైన మానవతా దృక్పథంతో కూడిన సేవ అని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న సిబ్బందిని కలెక్టర్ అభినందించి, సమాజంలో రక్తదానం పై మరింత అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ హనుమంతరావు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






