06-10-2025 12:00:00 AM
తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్
వనపర్తి, అక్టోబర్ 05 ( విజయక్రాంతి ) : మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ అన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.81 కోట్ల వ్యయంతో, 20 ఎకరాల స్థలంలో నూతనంగా నిర్మించనున్న 10+2 కోర్టు(పోక్సో, ఫ్యామిలీ కోర్టు కాంప్లెక్స్ తో కలిపి) భవన సముదాయానికి తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ఆన్లైన్ ద్వారా శిలా ఫలాకాన్ని ఆవిష్కరణ చేయగా, హై కోర్టు న్యాయమూర్తులు అనిల్ కుమార్ జూకంటి, మాధవి దేవి భూమి పూజ, శంఖుస్థాపన చేశారు.
ముఖ్య అతిథులతో పాటు రిటైర్డ్ జడ్జి, తెలంగాణ ఈఆర్సీ ఛైర్మన్ డి నాగార్జున, వనపర్తి జిల్లా న్యాయమూర్తి ఎం ఆర్ సునీత, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పీ పీ కిరణ్ కుమార్ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నూతన న్యాయస్థానాల్లో మెరుగైన వసతులతో అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పవిత్రమైన విజయదశమి పర్వదినాల సమయంలో వనపర్తి జిల్లాలో నూతన కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం ఆనందకర విషయమని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కోర్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ అభినందనలు తెలియజేశారు. శంకుస్థాపన అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు సభను ఉద్దేశించి మాట్లాడారు. జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభ పరిణామం అన్నారు. న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడం కోసం మంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం యొక్క ప్రాధాన్యతను వివరించారు.
ఇప్పుడు న్యాయవ్యవస్థను బలోపేతం చేసే దిశగా నిర్మిస్తున్న ఈ నూతన కోర్టు కాంప్లెక్స్ అందరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ నూతన కోర్టు భవన నిర్మాణం కోసం అందరి కృషి ఉందన్నారు. అదేవిధంగా జిల్లాలో లీగల్ లిటరసీ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వనపర్తి బార్ అసోసియేషన్ తరపున ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా లీగల్ అథారిటీ సెల్ కార్యదర్శి రజిని, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఇతరులు తదితరులు పాల్గొన్నారు.