26 August, 2026 | 2:41 AM

జనమంతా వన మహోత్సవంలో భాగస్వామ్యం కావాలి

25-08-2026 11:59 PM

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ / కల్వకుర్తి / కొల్లాపూర్ రూరల్ ఆగస్టు 25 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం పెద్ద ముద్దునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. 100 మొక్కలను నాటి, ప్రతి విద్యార్థి ఒక మొక్కను కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు.

కొల్లాపూర్ పీజీ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు పచ్చదనం పెంచాలని, నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగేలా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. కల్వకుర్తి జయ ప్రకాష్నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.