పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి, ఆగస్టు 25 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా అదన కలెక్టర్ విక్టర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో వన మహోత్సవంలో భాగంగా వివిధ శాఖ అధికారులతో కలిసి మొక్కలను నాటారు. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి అన్నారు. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. .
మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ నీరజ్, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ ముకుంద రెడ్డి,గీత కార్మికులతో కలిసి అదనపు కలెక్టర్ విక్టర్ మొక్కలు నాటారు. 1,200 ఈత మొక్కలను నాటారు, జిల్లాలో వన మహోత్సవం కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాఘవపూర్లో 1,200 ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు.
వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రవి తేజ, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.






