calender_icon.png 5 December, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా అక్రమార్జనే!

05-12-2025 01:22:53 AM

ఆదాయానికి మించి.. ఆస్తులతో రంగారెడ్డి ఏడీ శ్రీనివాస్ అరెస్ట్

  1. ఆయన నివాసం, రంగారెడ్డి కలెక్టరేట్ సహా -ఆరు చోట్ల ఏసీబీ సోదాలు
  2. -రైస్ మిల్లు, షెల్ కంపెనీలు బట్టబయలు.. రాయదుర్గంలో ఫ్లాట్
  3. కర్ణాటకలో 11, అనంతపురంలో 11 ఎకరాల భూమి
  4. మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ప్లాట్లు గుర్తింపు
  5. రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, కీలక పత్రాలు స్వాధీనం

శేరిలింగంపల్లి/ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులను అవినీతి నిరోధక శాఖ (ఏసీ బీ) అధికారులు గురువారం సాయం త్రం అరెస్ట్ చేశారు. ఉదయం ౬ గంటల నుంచే ఆరు బృందాలుగా ఏర్పడిన అధికారులు గచ్చిబౌలి మైత్రి హోమ్స్ వద్ద ఉన్న ఆయన నివాసం, రంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఏడీ కార్యాలయంతోపాటు అత డి బంధువులు, మిత్రులు, బినామీల ఇళ్ల లో ఏకకాలంలో దాడులు నిర్వహించా రు.

సోదాల్లో ఏడీ శ్రీనివాసులు పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు బయటపడింది. మహబూబ్‌నగర్ జిల్లా లో రైస్ మిల్లు, పలు షెల్ కంపెనీల పేరు తో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో విస్తా రంగా ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలిం ది. రాయదుర్గం మైహోం భుజలో ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపురం పరిధిలో మరో 11 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో రైస్‌మిల్లు, మూడు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దాడుల్లో రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, రెండు కార్లు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పత్రాల్లో నమోదైన విలువ కంటే అసలు మార్కెట్ రేట్ల ప్రకారం ఈ ఆస్తుల మొత్తం విలువ మరింత భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో శ్రీనివాసులును అరెస్టు చేసిన అధికారులు.. విచారణ కొనసాగిస్తున్నారు. కాగా ఈ సంఘటనతో రంగారెడ్డి కలెక్టరేట్ అధికారుల్లో గుబులు రేగింది. ఇప్పటికే ఇదే కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్, సూపర్‌వైజర్ స్థాయి అధికారులు పట్టుబడ్డారు. ఇప్పుడు ఏడీ పట్టుబడటంతో మరింత కలకలం రేపుతోంది.