07-12-2025 01:28:10 PM
హైదరాబాద్: దావోస్ ఆర్థిక వేదికను తలపించేలా హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 జరుగునుంది. ప్యూచర్ సిటీ వేదికగా రేపు, ఎల్లుండి నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజాలు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు తరలిరానున్నారు. తెలంగాణ రైజింగ్ థీమ్ పేరుతో ఒకే వేదికపైకి వివిధ రంగాల ప్రముఖులు, పరిశ్రమల అధినేతలు, ఇన్నొవేటర్లు, సినీ, క్రీడా, విద్య రంగాల ప్రముఖులు, విదేశీ రాయబారులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు హాజరు కానున్నారు.
హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సులో పాల్గొనాలని 4800 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు అందించగా, సదస్సుకు 2 వేల మందికిపైగా అతిథులు హాజరవుతారని ప్రభుత్వ అంచనా. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల రాక దృష్ట్యా నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్ మూడు భాషల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
గ్లోబల్ సమిట్ జరిగే ప్రాంతంలో భారీ సెమినార్ హాళ్లు ఏర్పాటు చేయాలని, రెండు రోజుల సదస్సులో తెలంగాణ భవిష్యత్ రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సమిట్ లో రూ.లక్ష కోట్లకుపైగానే పెట్టుబడుల ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కార్యాచరణ ప్రణాళిక, కాలుష్య రహితం(నెట్ జీరో), సెమీ కండక్టర్ల పరిశ్రమ, కృత్రిమ మేధ, మానవ వనరుల అభివృద్ధి, మహిళల ఆర్థికాభివృద్ధి, క్రీడాభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వృద్ధి, తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ నెల 9న రాత్రి డ్రోన్లతో ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు జరుగుతుందని అధికారులు తెలిపారు.