07-12-2025 02:22:32 PM
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉందని, ఆయనకు ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సీ సైతం ఆసక్తి చూపారని తెలిపారు.
దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్ బాల్ క్రీడాభిమానులు మ్యాచ్ కోసం వస్తున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకుని వారి వారి సీట్లలో కూర్చోవాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడిషనల్ డీజీ విజయ్ కుమార్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, రోహన్ రెడ్డి, శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.