ఏపీలో కూటమిదే గెలుపు
మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌లో కూటమికే మొగ్గు
టీడీపీకి సొంతంగా మెజారిటీ వస్తుందన్న అంచనా
ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు ఎదురుగాలి
హిమాచల్, సిక్కింలోనూ బీజేపీదే ఆధిక్యం
న్యూఢిల్లీ, జూన్ 1: లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికలు సాగిన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి మూడింట రెండొంతుల మెజారి సాధిస్తుందని కొన్ని సర్వేలు వెల్లడించాయి. అధికార వైసీపీ ఘోరమైన పరాజయం కాకున్నా అధికారం కోల్పోతుందని అంచనా వేశాయి.
ఒడిశాలో బీజేపీ హవా
ఒడిశాలో ఈసారి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఎదురుగాలి వీస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చిందని వెల్లడించాయి. రాష్ట్రంలో ౨౧ లోక్‌సభ సీట్లు ఉండగా, బీజేపీ ౧౫ గెలుస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి. బీజేడీ ౩ నుంచి ౮ సీట్ల లోపు గెలుస్తుందని తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల తోపాటే ఇక్కడ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కిం లో సిక్కిం క్రాంతికారి మోర్చా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాయని ఎగ్జిట్‌పోల్స్‌లో తేలింది.






