25 July, 2026 | 4:38 PM

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి

25-07-2026 04:06 PM

నిర్మల్ జులై 25 ( విజయక్రాంతి): గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై శనివారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పుష్కర జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఎస్పీ జానకి షర్మిల పాల్గొని జిల్లా ఏర్పాట్లపై వివరాలు సమర్పించారు.

సమీక్షలో భాగంగా పుష్కర ఘాట్‌ల వద్ద వాచ్ టవర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటు వంటి భద్రతా చర్యలను ముందస్తుగా పూర్తి చేయాలని ఏడీజీపీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమగ్ర భద్రతా ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని బాసర, సోన్, సావర్‌గాం ప్రాంతాల్లో పుష్కరాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భైంసా అదనపు ఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్, కృష్ణ, సత్యనారాయణ, దీపక్, రవీందర్, ఆర్‌ఐ రామ్‌నిరంజన్, ఎస్సైలు పాల్గొన్నారు.