ఎన్డీయేదే హవా..!
ఎన్డీయేకే పట్టం కట్టిన మెజారిటీ సర్వేలు
మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా
బీజేపీ 400 సీట్లు సాధించడం కష్టమే..
ఎన్నికల్లో చతికిలపడ్డ ఇండియా కూటమి
295 సీట్లు సాధిస్తామంటున్న మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ, జూన్ 1: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. యావత్ భారత్ ఉత్కంఠగా ఎదురుచూస్త్ను ఎగ్జిట్ పోల్స్ సర్వేల అంచనాలు కూడా వెలువడ్డాయి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఇప్పటికే జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రానుంది. మెజారిటీ ఏజెన్సీలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్పిన అంకె మాత్రం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఇక, ఇండియా కూటమి వరుసగా మూడోసారి చతికిలపడినట్టు కనిపిస్తోంది. అయి తే తాము మాత్రం 2౯5కు పైగా సీట్లు సాధిస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నది.
బీజేపీకి గరిష్టంగా 392 స్థానాలు
సార్వత్రిక ఎన్నికల్లో హావా కొనసాగిస్తున్న ఎన్డీయే కూటమికి కనిష్టంగా 281 సీట్లు, గరిష్టంగా 392 సీట్లు వచ్చే అవకాశం ఉందని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. జన్‌కీ బాత్, ఇండియ న్యూస్ డైనమిక్స్, రిపబ్లిక్ పీ మార్క్, రిపబ్లిక్ భారత్ వంటి సంస్థలు ఎన్డీయే వైపు మొగ్గు చూపాయి. సీఎన్‌ఎక్స్ సర్వే సంస్థ మాత్రం ఎన్డీయే 371 నుంచి 401 సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. ఇండియా కూటమికి అనుకూలంగా ఒక్క సర్వే సంస్థ కూడా చెప్పలేదు. పలు సంస్థల అంచనా ప్రకారం.. 118 నుంచి 154 స్థానాల వద్దే ఇండియా కూటమి ఆగేలా కనిపిస్తోంది.






