మహిళా పోలీసులకు" పోలీస్ అక్క" కార్యక్రమంపై అవగాహన
విద్యాసంస్థలను తరచుగా సందర్శించారు
మహిళా, బాలికల పట్ల పక్కాగా అమలు చేయాలి
కొత్తగూడెం జులై 25 విజయక్రాంతి: జిల్లాలో అమలు చేయనున్న "పోలీస్ అక్క" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు, మహిళా పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేక అవగాహన సమావేశంను,శనివారం ఎస్పీ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు "పోలీస్ అక్క"గా విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించి, విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, బుల్లీయింగ్, ఈవ్ టీజింగ్, స్టాకింగ్, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేసేలా విశ్వాసాన్ని కల్పించాలని సూచించారు.
అదేవిధంగా, ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత, షీ టీమ్ ఎస్‌హెచ్‌ఓ కు సమాచారం అందించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి మహిళా పోలీసు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. "పోలీస్ అక్క" కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి మహిళలు, బాలికల భద్రతకు,మరింత భరోసా కల్పించాలని మహిళా పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, షీటీం ఎస్‌హెచ్‌ఓ రమాదేవి, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






