పేలిన వెంటిలేటర్
- ముగ్గురు నవజాత శిశువులు మృతి
- 36 మంది చిన్నారులు సురక్షితం
- మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో ఘోరం
ముంబై, ఆగస్టు 24: అమ్మ ఒడిలో వెచ్చగా ఒదగాల్సిన పసికందులు.. ఆసుపత్రిలోనే కన్నుమూశారు. జన్మించిన కొద్ది రోజులకే ముగ్గురు నవజాత శిశువులు అగ్నిప్రమాదానికి బలయ్యారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండక ముందే జన్మించిన, తక్కువ బరువుతో పుట్టిన, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలోని నవజాత శిశు కేంద్రంలో 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు.
తెల్లవారు జామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా వెంటిలేటర్‌కు మంటలు అంటుకోవడంతో గదిలో దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాదాన్ని గుర్తించిన వైద్యసిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రాణాలకు తెగించి చిన్నారులను ఒక్కొక్కరిగా బయటకు తరలించారు. 36 మంది శిశువులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ముగ్గురు చిన్నారులను కాపాడలేకపోయారు. మరో ఆరుగురు శిశువులకు మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వెంటిలేటర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయి. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు తర్వాతే తేలనుంది.
విద్యుత్ వ్యవస్థలో లోపమా, పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యమా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై అమరావతి పోలీస్ కమిషనర్ రాకేశ్ ఓలా మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టామని, శిశువులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ప్రభుత్వం భరోసా
మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని వెల్లడించారు. కాగా పసికందుల కోసం అత్యంత భద్రతతో ఉండాల్సిన నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన ఈ ఘటన.. ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు, పరికరాల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.






