5 August, 2026 | 11:40 AM

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అరికట్టాలి

27-05-2024 12:49 AM

నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలి

ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (విజయక్రాంతి): ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ అరికట్టాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి కే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని, అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్నారు.

కొన్ని పాఠశాలలు ఏటా 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచుతున్నాయని ఆరోపించారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ఆ చట్టం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో మరింత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఫీజులు ఉండేలా చూడాలన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమల్లో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌కేజీ ఫీజు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్నాయని, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోయారు.

ఆఖరికి పుస్తకాలు, బూట్లు, టైలు, బెల్ట్‌ల వరకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెట్టి అమ్ముతున్నారు. నిజానికి స్కూళ్ల పరిధిలో వీటిని అమ్మకూడదనే నిబంధన ఉన్నా, యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే కొన్ని స్కూళ్లలో మౌలిక వసతులు లేకపోయినా అధికారులు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు లెనిన్, ఉపాధ్యక్షుడు నాగేందర్, శ్రీమాన్, సహాయ కార్యదర్శి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.