ముక్కోటికి వచ్చే భక్తులకు గిరిజన మ్యూజియం తెలిసేలా విస్తృత ప్రచారం
భద్రాచలం, డిసెంబర్ 15, (విజయక్రాంతి)ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం మరింత ప్రాచుర్యంలోకి రావడానికి మరియు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు తెలిసే విధంగా ముఖ్యమైన కూడళ్లలో విద్యుత్ కాంతులతో వెదజల్లేలా సమాచార బోర్డులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం నాడు సాయంత్రం భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పా యింట్, విస్తా కాంప్లెక్స్, మిథిలా స్టేడియం పరిసరాలు, మాడవీధుల పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతతరం ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మరియు పాతకాలపు పనిముట్లతో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంను భక్తులతో పాటు వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నారని, త్వరలో మ్యూజియమును మరింత హంగులతో చూపరులకు ప్రతిబింబించేలా పర్యాట కులకు నచ్చే విధంగా కొన్ని మార్పులు చేస్తున్నామని, అందరికీ తెలిసేలా విద్యుత్ కాంతులతో వెదజల్లేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
అనంతరం ఐటిడిఏ ఆధ్వర్యంలో నడపబడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ లను పరిశీలించి కాంప్లెక్స్ లలో నిర్వహించబడుతున్న వ్యాపారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిసిసి ఆధ్వర్యంలో నడపబడుతున్న గిరి బజార్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






