15 August, 2026 | 1:51 AM

సీటు గ్యారెంటీ పేరుతో దోపిడీ.. అధికారుల పర్యవేక్షణ శూన్యం

15-08-2026 12:00 AM
  1. అయిజలో అనుమతి లేని గురుకుల కోచింగ్ సెంటర్లపై ఆరోపణలు
  2. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆవేదన
  3. పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటాం: ఎంఈఓ రాములు దయాల్

అయిజ, ఆగస్టు 14: గురుకుల పాఠశాలల్లో సీటు ఇప్పిస్తామంటూ అయిజ మండల కేంద్రంలో పలు కోచింగ్ సెంటర్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు, అర్హత కలిగిన సిబ్బంది, కనీస మౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్నదానిపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు వస్తే భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఇదే అవకాశంగా భావిస్తున్న కొందరు నిర్వాహకులు సీటు గ్యారెంటీ పేరుతో ముందుగానే వేలు నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే పరీక్షల అనంతరం సీటు రాకపోతే వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు.మరోవైపు, అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి విస్తృత తనిఖీలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంలో అధికారులు వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

రాములు దయాల్ మండల విద్యాధికారి అయిజ

ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి రాములు దయాల్ను వివరణ కోరగా, ఇట్టి విషయం మా దృష్టికి ఇంతవరకు రాలేదు. పర్యవేక్షణ చేసి అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.అనుమతులు, నిబంధనలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.