ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు
- ప్రభుత్వ పథకాల కు ఫోర్జరీ సంతకాలతో మోసం
- 52 ఫోర్జరీ సంతకాలతో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల పొందిన చెక్కులు
- అధికారుల సంతకాల ఫోర్జరీ , ముగ్గురి అరెస్ట్, రిమాండ్
- కంప్యూటర్, నకిలీ సర్టిఫికెట్లు, మూడు ఫోన్లు స్వాధీనం
- జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): ఫోర్జరీ సంతకాల తో ప్రభుత్వ పథకాల డబ్బులను కొల్లగొట్టిన ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ఈ ముఠా అక్రమాలకు పాల్పడింది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ చెందారి సంతోష్ తన పేరుతో తన సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులు పెట్టి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద నకిలీ ధ్రువపత్రాలను జతపరిచి దరఖాస్తు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్, పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. భిక్కనూర్ కు చెందిన ప్రసాద్, మరో ఇద్దరు కలిసి పర్సంటేజ్ తీసుకొని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం డబ్బులు ఇప్పించిన ముగ్గురు ముఠాను ఎట్టకేలకు కామారెడ్డి పోలీసులు మంగళవారం పట్టుకొని కటకటాల పాలు చేశారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ ధ్రువపత్రాల లో తయారు చేస్తున్న ముఠా వివరాలను వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన బోయిని ప్రసాద్ తో పాటు తోడంగల రాజ నరేందర్, తోడైంగల రాజలింగం లు కలిసి బిక్కనూరు లో లహరి జిరాక్స్ సెంటఆర్, ఆన్లైన్ సి ఎస్ ఈ సెంటర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు నిందితులను అదుపులో తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
వారి వద్ద నుంచి కంప్యూటర్ సిపియు, ఎల్ సి డి, మానిటర్, కీబోర్డు, మౌస్, మూడు మొబైల్ ఫోన్ లు, నకిలీ రబ్బర్ స్టాంపులు, ప్యాడు, నకిలీ సంతకాలు ఉపయోగించిన పెన్నులు, కంప్యూటర్లో భద్రపరిచిన దరఖాస్తుల డిజిటల్ రికార్డులు, ఇతర నేర సంబంధిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.ఈ కేసును సాంకేతిక ఆధారాల సాయంతో చాకచక్యంగా చేదించి నిందితులను అరెస్టు చేసిన కామారెడ్డి డిఎస్పి మధుసూదన్ కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.






