calender_icon.png 28 October, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

28-10-2025 12:00:00 AM

-హైదరాబాద్‌లో తులం గోల్డ్ ధర రూ.1.23 లక్షలు

-కిలో వెండి ధర రూ.1.70 లక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 27: రెండు నెలలుగా విపరీతంగా పెరిగిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి పండుగ తర్వాత బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతూనే ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో మొన్నటి వరకు 10 గ్రాముల బంగారం ధర సుమారు 1.30 లక్షలకు పైగా ఉండగా, తాజాగా సుమారు 1.24 లక్షలకు చేరింది. అలాగే కిలో వెండి మొన్నటివరకు 1.90 లక్షలు ఉండగా ప్రస్తుతం 1.70 లక్షలకు చేరింది. హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,280 పలికింది.

అలాగే కిలో వెండి 1.70 లక్షలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ బలపడటం, అమెరికాకు చైనా, భారత్‌తో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతుండటం వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మెహతా ఈక్విటీస్ నిపుణుడు రాహుల్ కలాంత్రీ తెలిపారు. దీనికి తోడు గాజాలో శాంతి చర్చలు పురోగతి సాధించడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని వివరించారు. అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం మందగించడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు ధరల పతనాన్ని కొంతమేర అడ్డుకుంటున్నాయి.

దీంతో తక్కువ ధరల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ వారం బులియన్ మార్కెట్‌కి అత్యంత కీలకం కానుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశమై వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ద్రవ్యోల్బణం బలహీనంగా ఉండటంతో పావు శాతం కోత విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ నిర్ణయం, భవిష్యత్‌పై చేసే వ్యాఖ్యలు బంగారం గమనాన్ని నిర్దేశిస్తాయని ఆస్పెక్ట్ బులియన్ సీఈవో దర్శన్ దేశాయ్ పేర్కొన్నారు. ఈ వారం మార్కెట్‌లో తీవ్ర ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.