21 July, 2026 | 11:22 AM

‘సోషల్ మీడియాలో నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు’

21-07-2026 12:00 AM

విజయవిహారం రమణమూర్తి

పంజాగుట్ట, జూలై 20 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయ విహారం రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై దాడి జరిగిన డిబేట్లో కేవలం తలకాయ అన్న మాటను అన్నందుకు తనను చంపేయాలన్నంత ఉన్మాదానికి కశ్యప్ రెడ్డి దిగాడన్నారు.. తలకాయ అన్నది అచ్చమైన తెలుగుమాటే కాని బూతు పదమేం కాదన్నారు.

ఇందులో కృష్ణుడిని అవమానపరిచిందేమిటి? ప్రశ్నిం చారు. తన నేపథ్యం గురించి కూడా పూర్తి అసత్యమైన,అసందర్భమైన ప్రచారాలు కొన్ని చానెళ్లలో జరుగుతున్నాయని వాపోయారు. గతంలో ఓ మహిళా వేదికపై మాట్లాడే వీడియోను కత్తిరించి తనను దైవదూషకుడిగా చిత్రిస్తున్నార న్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవం...ఏమతంలోనైనా అసమానత్వాలకి వ్యతిరేకమైన అంశాలుంటే వ్యతిరేకించడానికి ఎప్పుడూ వెనకాడలేదని స్పష్టం చేశారు.

తాను స్ఫూర్తికి భక్తుణ్ణి... విగ్రహానికి కాదని ఎన్నో సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు. హిందూమతంలోని ఉన్నత విలువల్ని, ద్వేషం అసమానత్వాలకి వ్యతిరేకంగా వున్న అంశాల గురించి విస్తారంగా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నానని.. మరి తానెలా హిందూ వ్యతిరేకినయ్యానో విమర్శకులకే తెలియాలని అభిప్రాయపడ్డారు. అబేధ దర్శనం ఙ్ఞానం అన్న మాట తనకు ఆచరణీయమని ఖరాఖండిగా తెలిపారు.

హిందువుగానే పుట్టాను, హిందువుగానే వుంటాను, హిందువుగానే మరణిస్తానని రమణమూర్తి ప్రకటించారు.హిందూమతంలో ఎన్నో స్రవంతులున్నాయనరి,  వీటిలో ఆర్యసమాజం, అలేఖ సంప్రదాయం వంటివి రాముడిని అంగీకరించలేదని పేర్కొన్నారు. మరి ఆ సంప్రదాయాలన్నింటినీ హిందూమతం నుంచి వేరు చేద్దామా? అని అడిగారు. నాటి నుంచి తనమీద పెట్టిన కేసులన్నీ కల్పితాలూ, అసత్యాలనీ  గౌరవ కోర్టులు ఇప్పటికే తీర్పులు వెలువరించాయని వెల్లడించారు.

తన మీద వ్యక్తిగత దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేయడాన్ని ఖండించారు. వచ్చే 24 గంటల్లో అసత్య వార్తలతో చేసిన వీడియోలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో న్యాయ పరిణామాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని  హెచ్చరించారు. అనంతరం హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ అధ్యక్షులు, అలేఖ్ సంప్రదాయానికి చెందిన సాధు త్రినాథ దాస్ మాట్లాడుతూ వైవిధ్యం కలిగినదే హిందూమతమన్నారు.

వేల ఏళ్లుగా విభిన్న స్రవంతులు మధ్య సమన్వ యంతో, సామరస్యంతో ఈ ధార కొనసాగుతోందన్నారు. కాని ద్వేషంతో తెగబడుతున్న శక్తులనుంచి హిందూమతాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ అధ్యక్షుడు స్వామి త్రినాథ దాస్ గురూజీ, జైభారత్ జాతీయ కార్యదర్శులు రజనీ, లోక్ నాథ్, అచలతత్వ్య ప్రచారకులు దున్న ఇద్దాసు పీఠం వారసులు దున్న  లక్ష్మీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.