01-10-2025 01:46:34 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : కాళేశ్వరం, ఫార్ములా ఈ- కార్ రేస్‌తో పాటు బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన స్కామ్‌ల బండారం ఒక్కొక్కటి బయట పడుతుండడంతో దిక్కుతోచక ‘బాకీ కార్డు’ పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ‘బాకీ కార్డు’ ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని.. దీన్ని చూసి జనాలు నవ్వు కుంటున్నారని ఎద్దేవా చేశారు.
మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్‌కే సాధ్యమని.. అది బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందని అన్నారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ చేసిన బాకీకి మేము వడ్డీలు కడుతున్నామని, బకాయిల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి కేసిఆర్ అవుతారన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే..
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని ఈ రెండు పార్టీలు కలిసే సంసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఒక్కటై కుట్ర పూరితంగా కాంగ్రెస్‌పై విష ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. మిగులు రాష్ర్టంగా ఉన్న తెలంగాణను అప్పల కుప్పల రాష్ర్టంగా మార్చిన బీఆర్‌ఎస్‌కు బాకీ అనే పదం కూడా ఎత్తే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్టా..? రైతు భరోసా ఇస్తే బాకీ పడ్డట్టా.. ? రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచడం బకాయి పడ్డట్టా.. ? అని ప్రశ్నించారు.
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వరికి రూ. 500 బోనస్ ఇవ్వడం బకాయి పడ్డట్టా.. ? రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం బకాయి పడ్టట్టా..? అని నిలదీశారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు..? ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు..? అని మహేష్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చడం బకాయి పడడమా..? అని నిలదీశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన నవాబు పాలన అని తెలంగాణను సర్వనాశనం చేసింది బీఆర్‌ఎస్ అని విమర్శించారు. ఎరువుల పేరిట కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తోందని, జీఎస్టీ పేరుతో వేల కోట్లు కేంద్రంలోని బీజేపీ నాయకులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
జూబ్లీహిల్స్‌తో పాటు స్థానికంలో 80 శాతం కాంగ్రెస్‌వే..
ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో 80శాతం పైగా సీట్లు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని అడిగే దమ్ము కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, అరవింద్‌కు లేదా అని ప్రశ్నించారు. బీసీల నోటి కాడా ముద్ద లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని, దేశంలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే నిర్వహించామన్నారు.
బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు. హైడ్రా రూపకల్పన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని ఆదిత్య కన్స్ట్రక్షన్ నిర్మాణంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.