calender_icon.png 1 October, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

80 లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం

01-10-2025 01:28:51 AM

  1. రాష్ట్రంలో అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలకు కేంద్రం సహకరించాలి  
  2. పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో అత్యధికంగా 80 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అందుకు తమ ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో సేకరణ లక్ష్యాలను, డెలివరీ నిబంధనలను సడలించి అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాగా 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణ దేశ చరిత్రలోనే రికార్డు అని చెప్పారు. గతేడాది 67 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 45---50 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వరి, 30--35 లక్షల టన్నుల దొడ్డు రకం సేకరించామన్నారు. అంతేకాకుండా క్వింటాలు ధాన్యానికి  రూ.2,389 కనీస మద్దతు ధర నిర్ణయించిన తర్వాత, 80 లక్షల టన్నుల సేకరణకు దాదాపు రూ.20,000 కోట్లు వ్యయం అవుతుందని, బోనస్ చెల్లింపులు, రవాణా ఖర్చులతో కలిపి రూ.24,000 కోట్ల నుంచి రూ.26,000 కోట్ల ఖర్చు అవుతుందని వివరించారు.

2024-25 కోసం కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ గడువును నవంబర్ 12 వరకు పొడిగిస్తూ, పారాబాయిల్డ్ రైస్‌గా మాత్రమే సరఫరాను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో ఇబ్బందులు ఎదురువుతాయని కేంద్రం దృష్టికి మంత్రి ఉత్తమ్ తీసుకెళ్లారు. ముడి బియ్యం మార్పిడికి ఖరీఫ్ వరి మరింత అనుకూలంగా ఉంటుందని, అందుబాటులో ఉన్న స్టాక్‌లో 7.80 లక్షల టన్నులు ముడి బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నాయని, 1.67 లక్షల టన్నుల ధాన్యం (1.13 టన్నుల బియ్యానికి సమానం) బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద ఉన్నదని చెప్పారు.

లభ్యతను బట్టి ముడి, బాయిల్డ్ రైస్ రెండింటినీ డెలివరీ చేయడానికి అనుమతి ఇవ్వాలని, బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని రబీ సీజన్‌కు మార్చాలని కేంద్రాన్ని కోరారు. కాగా సెప్టెంబర్ చివరి నాటికి ఖరీఫ్ 2024-25 నుంచి 5.44 లక్షల టన్నుల సీఎంఆర్, రబీ 2024-25 నుంచి 14.92 లక్షల టన్నుల సీఎంఆర్  పంపిణీ చేయలేదన్నారు. దీని ఫలితంగా మిల్లర్లు కార్యకలాపాలను నిలిపివేయగా, పని లేకపోవడం వల్ల కార్మికులు రైస్ మిల్లులను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆవేద వ్యక్తం చేశారు. 

300 ప్రత్యేక రేక్‌లను (రైళ్లు) ఇవ్వండి

రాష్ర్టంలోని 22.61 లక్షల టన్నుల మొత్తం ఎఫ్‌సీఐ నిల్వ సామర్థ్యంలో 21.72 లక్షల టన్నులు ఇప్పటికే నిండి ఉన్నాయని, కేవలం 0.89 లక్షల టన్నులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణలోని ఎఫ్‌సీఐ గోడౌన్లు నిండిపోయాయని, వాటిని నెలకు కనీసం 300 ప్రత్యేక రేక్‌లను (రైళ్లు) ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ ఖరీఫ్ పంటలో మరో 10 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

80 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానమైన 53.60 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని, లేదంటే లక్షలాది మంది రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటారని వివరించారు. గత రబీ సీజన్‌లో తెలంగాణ 74 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, కేంద్రం 53 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే తీసుకున్నదని, ఇప్పటికే సేకరించిన రబీ పంట నుంచి మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని, సేకరణ గడువును అక్టోబర్ 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించాలని కోరారు. అదనపు లిఫ్టింగ్ నిల్వను ఏర్పాటు చేయకపోతే, కొనుగోళ్లు చేయడం సాధ్యం కాదన్నారు.