10 ఎకరాల వరకే రైతు భరోసా!
- ఇప్పటికే బీడు, వెంచర్లు, గుట్టలు, రోడ్ల జాబితా సిద్ధం
- ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పేర్ల గుర్తింపు
- ఐటీ చెల్లించే వారిని మినహాయించాలంటున్న రైతులు
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు కటాప్ పది ఎకరాలకు చేసేందుకు కసరత్తు చేస్తోంది. గత పక్షం రోజుల నుంచి వ్యవసాయశాఖ అనర్హుల జాబితాపై గ్రామా ల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఐదు ఎకరాల వరకే పరిమితం చేయకుండా పది ఎకరాల రైతులకూ సాయం అందిస్తే వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కోత పెట్టవద్దని, పిల్లల చదువులు, ఇంటి రుణం కోసం ఐటీ చెల్లించామని దానిని పరిగణలోకి తీసుకొని ధనవంతులుగా గుర్తించరాదని పేర్కొన్నట్లు స్థానిక వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
గుట్టలు, రోడ్లు, ప్రైవేటు వెంచర్లు, వ్యాపార కార్యక్రమాలకు వినియోగించే వాటికి కోత పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల పేర్లనూ రైతుభరోసా నుంచి కట్ చేయాలని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు, ఉద్యోగులకు వేతనంతో పాటు భూమి కౌలు వస్తుండటంతో పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతున్నట్లు రైతులు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మండల వ్యవసాయశాఖ అధికారులకు పంటకు అనువైన భూములు గుర్తించి వాటి జాబితా సిద్ధం చేశారని, ఐదారు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికనూ సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో పేదల కంటే ఎక్కువ కోటీశ్వర్లే లబ్ధి పొంది, ఎద్దు, నాగలి పట్టకుండా ఉచితంగా పెట్టుబడి సాయం పొందారు. అర్హతలేని వారికి పెద్దమొత్తంలో డబ్బులు వెళ్లడంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనర్హులను తొలగించి నిజమైన రైతులకు పంట సాయం అందించి ప్రోత్సహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ వానకాలం రూ.7,500 జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన భూములు, పండించే భూములను ఏవో, ఏఈవోలు గుర్తించినట్లు తెలిపారు.
10 శాతం సాగులేని భూములే
ధరణిలో నమోదైన భూముల్లో 10 శాతం వరకు బీడు, వెంచర్లు, రోడ్లు, గుట్టలు, సాగులేని భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ సమీప ప్రాంతాలతో పాటు జిల్లాలు, మండల కేంద్రాల్లో గత పాతికేళ్ల నుంచి వెంచర్లు చేసి విక్రయాలు జరిపారు. అక్కడ పెద్ద భవంతులు కూడా వెలిశాయి. అయినా పట్టాదారుల ఖాతాల్లో రైతుబంధు పడింది. ఇళ్ల నిర్మాణాలు జరిగినవి సుమారు 3 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారుల సర్వేలో తేలింది. గుట్టలు, రహదారులు, పడావు భూములు, అక్రమంగా పట్టా చేసిన ప్రభుత్వ భూములు, అటవీ భూములు 3.50 లక్షల ఎకరాలు వరకు ఉండే అవకాశం ఉంది.
పది ఎకరాల రైతుల జాబితా
రాష్ట్రంలో 68.99 లక్షల మంది రైతులకు 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల వెల్లడిస్తున్నాయి. వీటిలో 73 శాతం (2.47 ఎకరాలు) సన్నకారు రైతులు, 17 శాతం చిన్న రైతులు (2.48 నుంచి 4.94 ఎకరాలు), ఒక శాతం మాత్రమే పెద్ద రైతులు (24.78 ఎకరాలు) కలిగిన రైతులు ఉన్నారు. లబ్ధిదారుల్లో 53 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరు 13 శాతం, ఇతర వర్గాలు 21 శాతం ఉన్నారు. వీరికి 2018 నుంచి ఏటా రెండు విడుతలుగా ఎకరానికి రూ.10వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది. కటాప్ లేకపోవడంతో పట్టా ఉన్న ప్రతి వ్యక్తికి రైతుబంధు వస్తుంది. ఈ విధానానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం పది ఎకరాల పంట సాగు చేసే రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తోంది.






