calender_icon.png 4 May, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ఫైనాన్స్ వేధింపులు... పెట్రోల్ పోసి ట్రాక్టర్కు నిప్పు

03-05-2025 08:44:36 PM

ఫిర్యాదు చేసేందుకు వెళ్తే నీ మీదే కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ట్రాక్టర్ ఫైనాన్స్ వేధింపులతో అవమానభారం తట్టుకోలేక ఓ రైతు తన వ్యవసాయ ట్రాక్టర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట్ మండలం చేగుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన గడ్డం రవి గత రెండు సంవత్సరాల క్రితం భూత్పూర్ మండల కేంద్రంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో తన తమ్ముడి భార్య జ్యోతి పేరా ట్రాక్టర్ కొనుగోలు చేసి ఫైనాన్స్ తీసుకున్నాడు. ప్రతి ఆరు నెలలకోసారి రూ.98 వేల చొప్పున ఇప్పటివరకు రెండు సార్లు ఫైనాన్స్ చెల్లించాడు.

పది రోజుల క్రితం ఈ నెల కిస్తీ క్రింద 80 వేలు చెల్లించగా మిగతా 18వేలు చెల్లించినప్పుడే రసీదు ఇస్తామని ఫైనాన్షియర్ చెప్పాడు. మిగితా బాలన్స్ సోమవారం వరకు చెల్లిస్తానంటూ ప్రాధాయపడినా వినకుండా ఫైనాన్షియల్ కోపంతో ఊగిపోయి ఇంటి వద్ద తిట్ల దండకాన్ని అందుకున్నాడు. వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించడంతో సదురు రైతు మనస్థాపం చెంది తన ట్రాక్టర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇది జరుగుతున్న సమయంలోనే సదరు ఫైనాన్స్యియర్ మెల్లిగా జారుకున్నాడు. అనంతరం నాగర్ కర్నూల్ సిఐ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తనపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపుతానంటూ పోలీసులు బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.