7 April, 2026 | 9:31 AM

కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతు

07-05-2024 01:06 AM

వరంగల్ తూర్పు, మే 6: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛంద మద్దతుదారులు పెరుగుతున్నారని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఎన్నికల పోస్టర్‌ని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఉర్సు దర్గా పీఠాధిపతి హజ్రత్ షా ఉబేయిద్ బాబాతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. సోమవారం పీఠాధిపతి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నదని చెప్పారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వరంగల్ తూర్పులో స్వచ్ఛందనంగా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు దర్గా పీఠాధిపతి ఉబేయిద్ బాబా దువా చేసి మద్దతు తెలిపారు.  

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం 

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య హామీ ఇచ్చారు. సోమవారం శివనగర్ కార్మిక పరపతి సంఘ భవనంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ప్రథమ చికిత్స అందించే విషయం లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు చేసే కృషి విలువకట్టలేనిదని అన్నారు. ఒక వైద్యురాలిగా తోటివైద్యుల కష్టాలు తీర్చడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషిచేయాలని కోరా రు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల భవనం కోసం జిల్లా  కలెక్టర్‌కు సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.