26 August, 2026 | 2:36 AM

రైతు భీమాపై సందిగ్ధం..!

26-08-2026 12:04 AM

మెదక్ జిల్లాలో 164064 మంది రైతులు నమోదు

ముగిసిన రెన్యువల్ గడువు..

ఇంకా స్పష్టతనివ్వని సర్కార్

ఆందోళనలో రైతులు..

మెదక్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రైతు బీమా పథకం ప్రతీ ఏడాది ఆగస్టులో అమలు కోసం బీమా కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది రెన్యువల్ ఒప్పందం పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

రైతు పేరిట గుంట భూమి ఉంటే చాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు మరణిస్తే నామినికి రూ.5లక్షలు వర్తింపజేస్తారు. రైతులకు అండగా నిలుస్తున్న ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనసాగుతుందా...నిలిపివేస్తారా అనే సందిగ్ధం రైతుల్లో నెలకొంది. అంతే కాదు అత్యంత కీలకమైన రైతు బీమా పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

జిల్లాలో 1.64 లక్షల మంది రైతులు నమోదు

రైతు బీమా పథకంలో భాగంగా ఈ ఏడాది మెదక్ జిల్లాలో 1.64లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికార లెక్కల ప్రకారం జిల్లాలో 3లక్షల మంది రైతులు భూమి కలిగి ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా రైతులు కుటుంబాలను పోషించుకుంటున్నారు. వ్యవసాయ పనుల్లో గానీ, ఇతర ప్రమాదాల్లో మరణిస్తే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతుంది. రైతు కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్ధేశంతో 2019 ఆగస్టు 15న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుక వచ్చింది.

రైతులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా కూడా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించి భారత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)తో ఒప్పందం కుదుర్చుకొంది. రైతు కుటుంబానికి అకస్మాత్తుగా రైతు మరణం తర్వాత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందడం వల్ల పంట నష్టాలు, అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు కొంత ఊరట లభించింది. దీన్ని ప్రతీ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం రెన్యువల్ చేయనుంది. దీంతో రైతు బీమా పథకం ఏడాది వరకు ఏ రైతు మృతి చెందినా భీమా వర్తిస్తుంది. 

ఇప్పటి వరకూ స్పష్టతనివ్వని సర్కార్

బీమా గడువు ముగిసిన వెంటనే రైతుల మరణాలు చోటు చేసుకో వడంతో ఆయా కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. రైతు బీమా కొనసాగుతున్నదా? కొత్త పాలసీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందా? విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందు తున్నారు. రూ.5 లక్షల పరిహారం అందుతుందన్న నమ్మకంతో ఉన్న కుటుంబాలకు ఇప్పుడు స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

గత ఏడాది రైతు బీమా గడువు ఈనెల 14తో ముగిసింది. సాధారణంగా కొత్త బీమా కాలానికి ముందుగానే ప్రీమియం చెల్లింపులు, రైతుల వివరాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి గడువు ముగిసే వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో సందేహాలకు తావిస్తోంది. అసలు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా, లేదా అనే సంశయం రైతుల్లో నెలకొన్నది.

జిల్లాలో రైతు బీమా వివరాలు

2022 సంవత్సరంలో 144693 మంది రైతులు నమోదు చేసుకోగా, 1233మంది రైతులు మృతి చెందగా వారి కుటుంబానికి రూ.5, లక్షల చొప్పున రూ.61కోట్ల 65లక్షలు చెల్లించారు. అలాగే 2023లో 157459మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇందులో 1380 మంది రైతులు చనిపోయారు. వీరికి 69కోట్లు బీమా డబ్బులు అందించారు. 2024లో 163970 మంది రైతులు నమోదు చేసుకోగా, 1447 మంది రైతులు మృతి చెందగా రూ.72 కోట్ల 35లక్షలు చెల్లించారు. 2025లో 164064 మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇందులో 1079 మంది రైతులు చనిపోయారు. వీరి కుటుంబాలకు రూ.53కోట్ల 95 లక్షల బీమా డబ్బులు జమ చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ నాలుగేడ్లలో రూ.255 కోట్లు రైతు బీమా డబ్బులు చెల్లించారు.