calender_icon.png 24 January, 2026 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం అర్ధరాత్రిళ్ళు పడిగాపులు.!

24-01-2026 11:20:55 AM

జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతాంగం(Farmers) అర్ధరాత్రిళ్ళు పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు మాని చలికి గజగజ వణుకుతూ యూరియా పంపిణీ కేంద్రం వద్ద క్యూ లైన్ లో కాళ్లకు తిమ్మిర్లు వచ్చేదాకా దీనంగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు యూరియా పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో శుక్రవారం రాత్రి నుండే సెంటర్ కు వచ్చి పడిగాపులు కాస్తున్నారు.

ఈసారి అత్యధిక శాతం యూరియా పంపిణీ చేశామని ప్రతి మండల కేంద్రంలో నిత్యం యూరియా బస్తాలు అందుబాటులోనే ఉన్నాయని అధికారులు చేస్తున్న ప్రకటనలు నీటిమీద రాతలు గానే మిగిలిపోయాయి. క్షేత్రస్థాయిలో ఆయా సెంటర్ల వద్ద రైతులను నానా తిప్పలు పెడుతుండడంతో రోజుల తరబడి వ్యవసాయ పనులు మాని పట్టణానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాలను సైతం వ్యవసాయ శాఖ అధికారులు మేకాతర్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటిపి సమస్య, వేలిముద్రలు వంటి సమస్యలు ఉన్నాయంటూ రైతులకు సరైన సమాచారం ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పడంతో పంట కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు.

కానీ ధనిక రైతులకు మాత్రం యూరియా బస్తా ధర 350 చొప్పున జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఫర్టిలైజర్ దుకాణదారు వందల సంఖ్యలో యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. దీంతో యూరియా బస్తాలు ఇస్తామని ప్రకటించిన వెంటనే వందల సంఖ్యలో రైతులు అర్ధరాత్రిలు సైతం యూరియా పంపిణీ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పూర్ణచందర్రావు స్పందిస్తూ ప్రతి మండలంలో యూరియా బస్తాలు అందుబాటులోనే ఉన్నాయని ఈసారి అత్యధిక స్థాయిలో యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారు రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రతి రైతుకు యూరియా అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.